తెలంగాణలో ఆంధ్ర ప్రతీకలా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేవలం పరిపాలనా విభజన కోసం కాదు. అది దశాబ్దాల పాటు సాగిన ప్రాంతీయ అస్తిత్వ యుద్ధం. ఆంధ్ర ఆధిపత్య రాజకీయాలు, వనరుల దోపిడీ, ఉద్యోగాల్లో అన్యాయం, తెలంగాణ భాషాసంస్కృతుల పట్ల అవమానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. వందలాది మంది విద్యార్థులు, యువత తమ ప్రాణాలను అర్పించి తెలంగాణను సాధించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు స్వయంపాలన, స్వాభిమానం తెలంగాణ ఉద్యమానికి మూలకేంద్రాలుగా నిలిచాయి.
అలాంటి తెలంగాణలో నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం మరోసారి తెలంగాణ అస్తిత్వ రాజకీయాలపై తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. మొన్న రవీంద్రభారతి ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు విషయంలోనూ పలువురు తెలంగాణ కవులు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆంధ్ర ఆధిపత్య సాంస్కృతిక ప్రతీకలను ముందుకుతేవడాన్ని వారు ప్రశ్నించారు.
అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను పక్కనపెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇది కేవలం సినీ, రాజకీయ నాయకుల విగ్రహ వ్యవహారం కాదు, తెలంగాణ ఉద్యమ ఆత్మను పాలకులు గౌరవిస్తున్నారా? లేక మళ్లీ ఆధిపత్య రాజకీయాల పునరుద్ధరణకు వేదిక సిద్ధం చేస్తున్నారా? అనేది తెలంగాణ మేధావుల ప్రశ్న.
ఉద్యమ సమయంలోనే ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ చరిత్రకు సంబంధం లేని విగ్రహాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మిలియన్ మార్చ్ రూపంలో యువత తమ ఆవేదనను చరిత్ర ముందుంచింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తమ చరిత్రకు, అమరవీరులకు, భాషకు, సాంస్కృతిక అస్తిత్వానికి గుర్తింపు కోరుకున్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ గొంతును అణచివేసిన ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగానే ఉద్యమం సాగింది.
ఇప్పుడు అదే తెలంగాణలో మళ్లీ ఆంధ్ర రాజకీయ ప్రతీకలను ప్రతిష్ఠించడం ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ గొప్ప నటుడు, తెలుగు రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ప్రశ్న ఏమిటంటే తెలంగాణలో ఆయనను రాజకీయంగా మళ్లీ పునర్జీవింపజేయడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజకీయ ప్రాధాన్యంతో ఏర్పాటు చేయడం సహజంగానే ప్రాంతీయ ఆత్మగౌరవ ప్రశ్నను మళ్లీ ముందుకుతెస్తోంది.
ఇది నిజంగా తెలంగాణ ప్రజల భావోద్వేగాల ప్రతిబింబమా? లేక ఆధిపత్య సామాజిక వర్గాల ఓటుబ్యాంకు రాజకీయాల కోసమా? అనే ప్రశ్న తీవ్రంగా వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆంధ్ర పెట్టుబడిదారులు, సెటిలర్ల ఓట్లను ఆకర్షించేందుకు జరుగుతున్న రాజకీయ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల విముక్తి, ఆత్మగౌరవం కంటే ఎన్నికల లెక్కలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మొన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం, నేడు ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ పెద్దగా వ్యతిరేకించడం లేదు. అంటే మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ సబ్బండ వర్గాల ఆత్మగౌరవ రాజకీయాల కంటే ఆంధ్ర, తెలంగాణ ఆధిపత్య రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బహుజనవర్గాల ఆశలు, ఆకాంక్షలకు విలువ దక్కడం లేదనే విమర్శ రోజురోజుకూ బలపడుతోంది. రాష్ట్రం ఏర్పడినా పాలనా వ్యవస్థలో, రాజకీయ పార్టీలలో, ఆర్థిక వనరుల పంపిణీలో ఇప్పటికీ అగ్రకుల పార్టీలు, నాయకుల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఉద్యమాన్ని భుజాన మోసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఇంకా అధికారానికి దూరంగానే ఉన్నారు. తమకు భూమి, సంపద, అధికారంలో ప్రాతినిధ్యం పెరుగుతుందని, ఆత్మగౌరవానికి గుర్తింపు లభిస్తుందని ఆశించారు.
కానీ, నేడు పాలనలోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ, సాంస్కృతిక ప్రతీకలలోనూ అదే ఆధిపత్య వర్గాల ప్రాబల్యం కొనసాగుతోంది. ఇదంతా చూస్తుంటే ‘తెలంగాణ ఉద్యమం అంతా ఆంధ్ర అగ్రవర్ణాల స్థానంలో తెలంగాణ అగ్రవర్ణాలు పరిపాలించడానికి జరుగుతున్న ఒక రాజకీయ ఎత్తుగడ’ అని 2009లో బీసీ ఎస్సీ, ఎస్టీల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ విశారదన్ మహరాజ్ అన్న మాటలు ముమ్మాటికీ నిజమనిపిస్తున్నాయి. నిజమైన తెలంగాణ అంటే భూమి పై హక్కు, సంపదలో వాటా, అధికారంలో ప్రాతినిధ్యం, సాంస్కృతిక గౌరవం దక్కాలి. ఇవి లేకపోతే తెలంగాణ వచ్చినా బహుజనులకు విముక్తి లభించనట్టే.
సంపతి రమేష్
వ్యాసకర్త సెల్: 7989579428






