1 June, 2026 | 3:29 AM

విద్యావ్యవస్థకు మేల్కొలుపు

01-06-2026 02:41 AM
  1. ముగ్గురు విద్యార్థుల సాహసోపేత డిజిటల్ పోరాటం
  2. సీబీఎస్‌ఈ ఫలితాల తర్వాత లోపాలను ఎండగట్టిన బుడతలు
  3. ఓఎస్‌ఎం.. అని చాటి చెప్పేందుకు సాక్ష్యాధారాల సేకరణ
  4. దిగివచ్చిన బోర్డు.. జవాబు పత్రాల రీ-స్కానింగ్‌కు ఆదేశం

న్యూఢిల్లీ, మే ౩౧: సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి ఫలితాల తర్వాత ఆన్‌స్క్రీన్ మూల్యాంకనం (ఓఎస్‌ఎం)పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. రీవాల్యూయేషన్ పోర్టల్ లోపాల పుట్ట అని దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఓఎస్‌ఎం విధానంపై దుమ్మెత్తి పోశారు. అయితే.. పోర్టల్‌లోని లోపాలను ఎండగట్టడంలో ముగ్గురు విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ఒక సమూహం.. ఒక బృందం.. సాధించలేని ఆధారాలను వీరు సేకరించి సంచలనం సృష్టించారు. ఆ ముగ్గురే వేదాంత్ శ్రీవాస్తవ, పార్థక్, నిసర్గ. ఢిల్లీకి చెందిన వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థికి ఫిజిక్స్ పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదు.

దీంతో అతడు ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో జరిగిన తన మూల్యాంకన పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పత్రాలను చూసి అతను షాక్‌కు గురయ్యాడు. వాటిలో వేరొకరి చేతిరాత ఉంది. తాను అసలు రాయని ప్రశ్నలకు కూడా సమాధానాలున్నాయి. దీనిపై వేదాంత్ ‘ఎక్స్’లో వాటిని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కాస్త దేశవ్యాప్తంగా వైరల్ అయింది. పోస్ట్‌పై సీబీఎస్‌ఈ బోర్డు స్పందిస్తూ తన తప్పును ఒప్పుకున్నది. అతనికి సరైన పత్రాన్ని పంపి మార్కులను సరిచేస్తామని ప్రకటించింది.

మరొక విద్యార్థి నిసర్గ అధికారి సైబర్ భద్రతపై పరిశోధనలు చేస్తుంటాడు. అతను ఈ ఓఎస్‌ఎం పోర్టల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు. పోర్టల్‌లో పెద్ద లోపాలను గుర్తించి సోషల్‌మీడియా ద్వారా ఎత్తిచూపాడు. ఒక సాధారణ పాస్‌వర్డ్ ద్వారా ఎవరికైనా ఓటీపీ లేకుండానే పరీక్షకుల ఖాతాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిరూపించాడు. సార్థక్ సిద్ధాంత్ అనే మరో విద్యార్థి సీబీఎస్‌ఈకి చెందిన 500కి పైగా టెండర్ పత్రాలను అధ్యయనం చేశాడు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ కాంట్రాక్ట్ నిబంధనలను ఒక నిర్దిష్ట ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా మార్చారని తన బ్లాగ్‌లో ఆరోపించాడు. హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యా టెక్ సంస్థ ప్రొఫైల్‌కు సరిపోయేలా ఈ మార్పులు జరిగాయని ఆధారాలను బయటపెట్టాడు. దీంతో విద్యా ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తాయి.

సత్ఫలితాలనిచ్చిన పోరాటం

ముగ్గురు విద్యార్థుల పోరాటం తక్షణ ఫలితాలను ఇచ్చింది. సీబీఎస్‌ఈ బోర్డు వేలాది జవాబు పత్రాలను మళ్లీ స్కానింగ్ ప్రారంభించింది. రీ వాల్యుయేషన్ గడువును కూడా పెంచింది. ఈ అంశం రాజకీయంగానూ సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఉన్న బోర్డు కార్యాలయాల ఎదుట నిరసనలు జరిగాయి. ఉన్నత స్థాయి తనిఖీలు చేపట్టాలనే డిమాండ్లు పెరిగాయి. డిజిటల్ వేదికల ద్వారా యువత గట్టిగా నిలదీస్తే ఎంతటి పెద్ద వ్యవస్థలైనా లొంగక తప్పదని కేవలం ముగ్గురు విద్యార్థులు నిరూపించారు.

ఈ పరిణామం దేశవ్యాప్తంగా కొత్త తరం ఆలోచనలకు అద్దం పడుతున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ తరం యువత పాత పద్ధతులను గుడ్డిగా నమ్మడం లేదనడానికి ఈ విద్యార్థులే నిదర్శనం. సోషల్ మీడియా, డేటా విశ్లేషణ, కోడింగ్ నైపుణ్యాల ద్వారా వ్యవస్థల్లోని అవినీతిని, అపారదర్శకతను నేటితరం ప్రశ్నిస్తున్నది. స్మార్ట్‌ఫోన్ల యుగంలో పుట్టి పెరిగిన నేటి తరం ప్రతి విషయంలోనూ పారదర్శకతను కోరుకుంటున్నది. సంక్లిష్టమైన ప్రభుత్వ వ్యవస్థలను కూడా తనిఖీ చేసే నైపుణ్యం నేటి పిల్లల్లో కనిపిడంచడం విశేషం. భవిష్యత్తులో విద్యాసంస్థల మూల్యాంకనంలో స్వతంత్ర తనిఖీలు తప్పనిసరి అయ్యేలా తాజా ఘటన ఒత్తిడి తీసుకొచ్చింది.