40 టీఎంసీలే దిక్కు!
కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులు వెలవెల
- డెడ్ స్టోరేజీ పోను మిగిలింది కొద్దిపాటి జలాలే..
- తెలంగాణను వెంటాడుతున్న నీటి సంక్షోభం
- 28 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం
- 30శాతం లోటు వర్షపాతం
- వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
- రాబోయే మూడునెలలు మరింత ప్రమాదకరం
- తాగు, సాగు నీటిరంగం, పరిశ్రమలు, సింగరేణి, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : తెలంగాణలో నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఎల్ నినో కంటింజెన్సీ ప్రణాళిక గణాంకాలు తాజా పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని అన్ని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీని మినహాయిస్తే వినియోగానికి కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఇదే నీటితో తాగు, సాగుకు, పరిశ్ర మలు, విద్యుత్ ఉత్పత్తి, సింగరేణి అవసరాలను తీర్చాల్సి ఉంటుంది.
సాధారణంగా జూలై మధ్య నాటికి రిజర్వాయర్లు వరద నీటితో నిండాలి. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు కుర వ లేదు. ఇప్పటికే చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు నెలల వరకూ ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల్లోకి వరద చేరే అవకాశం లేకపోవడం, భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటి నిర్వహణ, తాగునీటి భద్రత, వ్యవసాయ రక్షణ ప్రభుత్వానికి అత్యంత కీలక సవాళ్లుగా మారాయి.
అత్యంత క్లిష్ట పరిస్థితులు
ఎల్ నినో పరిస్థితుల కారణంగా కృష్ణా బేసిన్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటన్నాయి. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టుల్లో వినియోగానికి కేవలం 12.88 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అందు లో నాగార్జునసాగర్‌లో 6.01 టీఎంసీలు, మిగతా మధ్యతరహా ప్రాజెక్టుల్లో కలిపి 5.88 టీఎంసీల నీరుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, అందులో అధిక భాగం డెడ్ స్టోరేజీ కింద పరిగణిస్తారు.
మిగిలిన కొద్దిపాటి జలాలనే హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల తాగు నీటి అవసరాలు, అలాగే నాగార్జునసాగర్ ఎడమ, కుడి కాలువల కింద లక్షలాది ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. వర్షాలు ఆశించిన మేర కురవకపోతే తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూ సాగునీటి విడుదలను ప్రభుత్వం పరిమితం చేసే అవకాశం ఉంది.
ఇక కృష్ణా నదిపై ఉన్న ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, తెలంగాణకు అదనపు వరద జలాలు వచ్చే అవకాశాలు తగ్గి పోయాయి. కృష్ణా బేసిన్‌తో పోలిస్తే గోదావరి బేసిన్‌లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది. గోదావరి బేసిన్‌లోని 7 ప్రధాన, 28 మధ్య తరహా రిజర్వా యర్లలో 66.50 టీఎంసీల నీరు ఉంది.
అందులో 37.21 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కింద ఉండటంతో, వినియోగానికి 29.30 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. ఉత్తర తెలంగాణకు కీలకమైన ప్రాజెక్టులన్నీ కనిష్ఠ స్థాయి నిల్వలతోనే కొనసాగుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 4.54 టీఎంసీలు, సింగూరులో 3.66 టీఎంసీలు, లోయర్ మానేరులో 3.60 టీఎంసీలు, మిడ్ మానేరులో 1.17 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 0.63 టీఎంసీలు, శ్రీరాంసా గర్‌లో కేవలం 0.28 టీఎంసీలు, కడెం ప్రాజెక్టులో 0.22 టీఎంసీల చొప్పున వినియోగానికి మిగిలాయి.
గోదావరి బేసిన్‌పై ఆధారపడిన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజ న్న సిరిసిల్ల, కామారెడ్డి తదితర జిల్లాల్లో సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా, పరిశ్రమల నీటి అవసరాలు ఈ నిల్వలపైనే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరాంసాగర్, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల్లో విని యోగానికి మిగిలిన నీరు ఒక టీఎంసీకి కూ డా చేరలేదు.
ఐదు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం
జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ర్టం లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 158 మిల్లీ మీట ర్లు మాత్రమే కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతం వర్షలోటు నమోదైంది. మొత్తం 28 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాగా, కేవలం 5 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షాలు కురిశాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం పరిస్థితి ఇక్కడి తో ఆగేలా కనిపించడం లేదు. ఆగస్టులో 15 శాతం, సెప్టెంబరులో 42 శాతం, అక్టోబరులో 55 శాతం వరకు వర్షపాతం లోటు నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
ఈ అంచనాలు నిజమైతే వానాకాలం పంటల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు యాసంగికి అవసరమైన నీటి నిల్వలు మరింత తగ్గిపోతాయి. తక్కువ వర్షపాతం కారణంగా రిజర్వాయర్లలోకి కొత్తగా నీటి ప్రవాహాలు ఉండక పోవచ్చు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న నిల్వలనే మరింత జాగ్రత్తగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే సమయంలో రైతు లు బోర్లపై ఆధారపడాల్సి రావడంతో భూగ ర్భ జలాలపై ఒత్తిడి పెరిగి, అవి మరింత వేగంగా దిగజారే ప్రమాదం ఉంది.
లోతుల్లోకి భూగర్భ జలాలు
ప్రభుత్వ అంచనాల ప్రకారం జూన్‌లో సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్లు ఉండగా, జూలైలో అది 10.35 మీటర్లకు పడిపోయింది. ఆగస్టు నాటికి 11.01 మీటర్ల లోతుకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అంటే కేవలం రెండు నెలల్లోనే భూగర్భ జలాలు దాదాపు 1.5 మీటర్లకు పైగా దిగజారే ప్రమాదం ఉంది. భూగర్భ జలమట్టం పడిపోతే బోర్లు ఎండిపోయే ప్రమాదం పెరుగుతుంది.
కొత్తగా బోర్లు వేసి నా నీరు దొరకకపోవడం, మోటార్ల విద్యుత్ వినియోగం పెరగడం, సాగు ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, బోర్‌వెల్స్ కూడా సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ట్యాంకర్లపై ఆధారపడే గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలపై ఆధారపడే కాలనీలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చు.
ప్రభుత్వానికి సవాల్
రిజర్వాయర్లలో వినియోగానికి కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే మిగలడం, వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయన్న అంచనాలు, భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతుండటంతో సంక్షోభం ప్రభావం దాదాపు అన్ని వర్గాలపై పడే అవకాశం ఉం ది. వరి, పత్తి, మిర్చి వంటి పంటలకు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. సాగునీటి కొరతతో దిగుబడులు తగ్గడం, సాగు వ్యయం పెరగడం, రైతుల ఆదాయం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది.
దీంతో పాటు తాగునీటి కోసం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై ఆధారపడిన హైదరాబాద్ సహా అనేక పట్టణాలకు తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదమూ ఉంది. పరిశ్రమలకు నీటి కేటా యింపులు తగ్గితే ఉత్పత్తి వ్యయాలు పెరగవచ్చు. కొన్ని పరిశ్రమలు ప్రత్యామ్నాయ నీటి వనరులను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సింగరేణి బొగ్గు గనుల కార్యక లాపాలకు కూడా నీటి లభ్యత కీలకం కావడంతో అక్కడ కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
విద్యుత్ రంగంపైనా పరోక్ష ప్రభావం ఉంటుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నీటి అవసరం అధికంగా ఉంటుంది. అలాగే జలవిద్యుత్ ఉత్పత్తి కూడా నీటి నిల్వలపైనే ఆధా రపడి ఉంటుంది. నీటి కొరత కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి నిర్వహణ కూడా సవాల్‌గా మారే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో తాగు, సాగునీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్ప త్తి, సింగరేణి అవసరాల మధ్య సమతుల్యత పాటిస్తూ పరిమిత నీటిని పంపిణీ చేయాల్సి ఉంటుంది. తాగునీటి అత్యవసర ప్రణాళికలు, చెరువుల ద్వారా స్థానిక నీటి నిల్వలు పెంచడం, వర్షపు నీటి సంరక్షణ, పంటల ప్రణాళిక, ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన వంటి చర్యలను ఒకేసారి అమలు చేయాల్సి ఉంటుంది.






