20 July, 2026 | 9:10 PM

అధికారమే లక్ష్యం

20-07-2026 02:27 AM
  1. సమరశంఖం  పూరించిన బీజేపీ 
  2. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై పోరుకు పిలుపు 
  3. ప్రజాద్రోహ పాలనపై పోరాటమే ఎజెండా
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : తెలంగాణలో అధికారమే లక్ష్యమని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై పోరుకు బీజేపీ సమరశంఖం పూరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా పరిధిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనబెట్టాయని విమర్శించారు.

కేవలం తమ కుటుంబాలు, తమకు కావాల్సిన వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమే ఆ రెండు పార్టీలు పరితపించాయని ధ్వజమెత్తారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతపై బీజేపీ నిరంతరం పోరాడి ప్రజలను సిద్ధం చేస్తే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని అబద్ధపు వాగ్దానాలు, గ్యారంటీల ద్వారా అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ‘అధికారంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి..

బిర్యానీ మేము వండితే, తిన్నది మీరు‘ అంటూ, బీజేపీ చేసిన పోరాటాల ఫలితాన్ని కాంగ్రెస్ అడ్డదారిలో అనుభవిస్తోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ కూడా సంస్థాగతంగా బీజేపీతో పోటీ పడలేదని రాoచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 35,000 పోలింగ్ బూత్‌ల్లో, దాదాపు 31,000 బూత్‌లలో పూర్తి స్థాయి బూత్ కమిటీలను కలిగి ఉన్నామన్నారు.

పార్టీకి 42 లక్షల పైగా సభ్యత్వం ఉందని, 920 మండలాలకు గాను 870 మండలాల్లో బలమైన యూనిట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో పార్టీకి కొంత వెనుకబాటు ఉన్న కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాలతో పాటు, పాతబస్తీ (ఓల్డ్ సిటీ) ఏరియాల్లో కూడా మైనారిటీలు పెద్ద సంఖ్యలో బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ బలమైన సంస్థాగత స్వరూపాన్ని రాబోయే రోజుల్లో రాజకీయ విజయాలుగా మార్చుకోవాలన్నారు.  

‘హైడ్రా’ దోపిడీ.. ప్రగతికి విఘాతం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హిట్లర్ అంటే ఇష్టమని, అందుకే ఆయన పాలన కూడా హిట్లర్ తరహాలోనే సాగుతోందని విమర్శించారు. ‘హైడ్రా’ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తూ మొదట గడ్డపార పట్టిందే పేదల మీద అని మండిపడ్డారు. ఫాతిమా కాలేజీ లాంటి పెద్ద సంస్థలను వదిలేసి, పేద వారి ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారని ఆరోపించారు.

ఇండస్ట్రియల్ భూములను రియల్ ఎస్టేట్ లాండ్‌గా మార్చుకోవడానికి, కేవలం రియల్ ఎస్టేట్ ద్వారా లబ్ధి పొందడానికే ఈ ‘హైడ్రా’ విధానాలను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. ‘హైడ్రా’ వల్ల చివరకు హైదరాబాద్‌లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కాలం ముగిసి, వర్షాకాలం వచ్చినా హైదరాబాద్ నగరంలో ప్రజలకు కనీసం తాగునీరు అందడం లేదని ధ్వజమెత్తారు.

బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి  

తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల దోపిడీ పాలనను చూసి విసిగిపోయిందని, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తోందని రాంచందర్ రావు తెలిపారు. ప్రస్తుత సర్వేలన్నీ బీజేపీ ప్రథమ స్థానంలో ఉందని స్పష్టం చేస్తుండటంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలలో వణుకు మొదలైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి విషయానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.

సినిమా తరహాలో ‘నేను కొండను లేపుతా, నలుగురు వచ్చి నా నెత్తిన పెట్టండి‘ అన్నట్లుగా రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి, ఇప్పుడు తీర్చలేక కేంద్రం మీద, కిషన్ రెడ్డి మీద నెట్టేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారం వల్లే రాష్ట్రంలో పేదలకు 5 కిలోల ఉచిత బియ్యం అందుతున్నాయని, స్వచ్ఛ భారత్ కింద ఏటా రూ. 400 కోట్లు వస్తున్నాయని గుర్తు చేశారు.

జాతీయ రహదారులు, తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్, జహీరాబాద్ నిమ్జ్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ టెక్ట్స్‌టైల్ పార్క్, రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సాధ్యమయ్యాయి. కేంద్రం ఇంతగా అభివృద్ధి చేస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయాల కోసం కేంద్రం సహకరించడం లేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

ప్రజలు బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాబట్టి కార్యకర్తలు, నాయకులు మరింత ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. డివిజన్ల వారీగా స్థానిక ప్రజాసమస్యలపై, రోడ్ల దుస్థితిపై, అధికార యంత్రాంగం, ప్రభుత్వ వైఫల్యాలపై రోడ్ల మీద కు వచ్చి ఉధృత పోరాటాలు చేయాలని జిల్లా అధ్యక్షుడిని, శ్రేణులను కోరారు. ఈ కార్యవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.

గ్రేటర్ హైదరాబాద్ విభజన.. మజ్లిస్‌కు కాంగ్రెస్ గిఫ్ట్

నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ పార్టీకి ఎంతమాత్రం లేదని రాoచందర్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన సభ పూర్తిగా ఫ్లాప్ అయిందని, అందులో అంతా వృద్ధులే కనిపించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పారని, 10 ఏళ్ల పాలనలో గ్రూప్--1 లాంటి కీలక పరీక్షల పేపర్లను లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు.

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకంటే దారుణంగా వ్యవహరిస్తోందని, కేవలం తమ మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు, అనుచరులకు పదవులు, ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారే తప్ప రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా కానిస్టేబుల్ పోస్టులు మినహా మరే ఇతర పెద్ద నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని పెంచి, 300 వార్డులు చేసి, ఎక్కడ బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందోనని భయపడి హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేశారని విమర్శించారు.

మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రాంతాలను విడదీసి, కేవలం మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ లబ్ధి పొందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యూహం పన్నారని, హైదరాబాద్ను మజ్లిస్ పార్టీకి బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్‌ల్లో ఎన్నికలు వస్తే ప్రజలు బీజేపీని ఆదరిస్తారని, మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. గతంలో లోకల్ బాడీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు మూడూ లోపాయికారీగా కలిసి పనిచేసిన ఉదాహరణలను ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల తుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.