వరద జాడే లేదు!
- డెడ్ స్టోరేజీకి జూరాల, శ్రీరాంసాగర్
- జూలై గడిచిపోతున్నా జాడ లేని వాన
- వెలవెలబోతున్న జలాశయాలు
- లక్షల ఎకరాల భవితవ్యం ప్రశ్నార్థకం
- అప్పులు తెచ్చి పంటలు వేసిన రైతులు
- ప్రాజెక్టులు నిండక సాగుపై సందిగ్ధం
- గతేడాది ఇదే సమయంలో జలాశయాలు కళకళ
మహబూబ్‌నగర్/నిర్మల్, జూలై 19 (విజయక్రాంతి) : ‘నాకున్న రెండెకరాలతో పా టు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని ఈ సారి పత్తి, మిరప వేద్దామనుకున్న. ముం దస్తుగా కురిసిన ఒకట్రెండు జల్లులను నమ్ముకుని అప్పులు చేసి ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టి దుక్కులు దున్నిం చి, విత్తనాలు కూడా కొనుగోలు చేశా. కానీ జూలై గడిచిపోతున్నా ఒక్క సరైన వాన పడలేదు. మబ్బులు వస్తున్నాయి, వాన మాత్రం కురవడం లేదు.
ఎండల తీవ్రతతో భూమి పగుళ్లు పడుతోంది. బోరు ఉన్నా కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. భూగర్భ జలాలు కూడా అడుగం టిపోయాయి. వానలు పడకపోతే పెట్టుబడి నష్టపోవడమే కాకుండా తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎలా చెల్లించాలో, కుటుంబాన్ని ఏవిధంగా పోషించాలో తోయడం లేదు. ప్రభు త్వం మమ్మల్ని ఆదుకోకపోతే రోడ్డున పడాల్సిందే’ అని రైతు వన్నం రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇది ఒక్క వన్నం రవి పరిస్థితి మాత్రమే కాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దాదాపు ప్రతి రైతు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రాష్ర్టంలోని ప్రధాన జలాశయాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయినిగా నిలిచే జూరాల, ఉత్తర తెలంగాణకు జీవనాధారమైన శ్రీరాంసాగర్ సాగర్‌కు ఇప్పటి వరకు సరైన వరదలు లేవు.
ఫలితంగా రెండు ప్రాజెక్టులూ డెడ్ స్టోరేజీకి చేరువ కావడం, సాగునీటి విడుదలపై అనిశ్చితి నెలకొనడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది ఇదే సమయానికి వరదలతో కళకళలాడిన జలాశయాలు ఈ సారి వెలవెలబోతుండటంతో తెలంగాణలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి.
కర్ణాటకలో ప్రాజెక్టులు నిండితేనే జూరాలకు జలకళ
ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఎగువనుంచి వరదలు లేకపోవడంతో జలాశయం అడుగంటింది. గతేడాది మే 29 నుంచే జూరా లకు వరద ప్రవాహం మొదలై జూలై నాటికి 7 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 1.11 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వరద చేరలేదు. ప్రస్తు తం ప్రాజెక్టులో కేవలం 1.809 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది.
ఇన్‌ఫ్లో నిల్‌గా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ఇందులో దాదాపు 3.71 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కింద ఉన్నా యి. డెడ్ స్టోరేజీ నీటిని సాగు నీటి కాల్వలకు వదలడానికి వీలుండదు. 5.94 టీఎంసీలు ఉంటేనే సాగు, తాగునీటి అవసరాలకు నీరు అందుబాటులో ఉన్నట్లు. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయా లు పూర్తిస్థాయిలో నిండితేనే దిగువకు నీటి ని విడుదల చేస్తారు. వరద నమోదు కాకపోవడంతో జూరాల అడుగంటింది.
ఎండుతున్న పంటలు
వానలు కురువక ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. తొలకరి జల్లులను నమ్ముకుని వేసిన విత్తనాలు చాలా వరకు మొలకలు రావడం లేదు. మొలకెత్తినవి ఎండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే సుమారు 3.20 లక్షల ఎకరాల్లో సాగు తగ్గినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వర్షాలు కురిస్తే ఆలస్యంగా అయినా సాగు విస్తీర్ణం కొంత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి 3.10 లక్షల ఎకరాలు, పత్తి 2.70 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 1.40లక్షల ఎకరాలు, కంది 2.5లక్షల ఎకరాలు, ఇత ర పంటలు 2.90 లక్షల ఎకరాలు సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
శ్రీరాంసాగర్‌లో ఉన్నది 15 టీఎంసీలే..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కూడా ప్రశ్నార్థకంగా మారింది. 90 టీఎంసీల సా మర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 15 టీఎంసీల మేరకే నీరుంది. ఈ ప్రాజెక్టు నిం డితే కాకతీయ సరస్వతి లక్ష్మీకెనాల్ ద్వారా 13.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. బ్యాక్‌బాటర్ ద్వారా నిర్మల్ జిల్లాలో ఎత్తిపోతల పథకాలు కొనసాగుతాయి. నిర్మల్ ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కూడా శ్రీరాంసాగర్ జలాల ఆధారంగానే రైతులు పంట లు పండిస్తారు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం ఒక్క టీఎంసీ నీరు మాత్రమే ప్రాజెక్టులోకి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. అది కూడా ఈనెల 1న మహారాష్ట్ర ప్రభు త్వం బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరిచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత ఏడా ది ఇదే సమయంలో 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.
గోదావరి పరీవాహక ప్రాంతంలో సాధారణ వర్షాలు తప్ప భారీ వర్షాలు లేవని, ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. ఒక వేళ మహారాష్ట్రలో వర్షాలు కురిసినా అక్కడి ప్రాజెక్టులు నిండిన తర్వాతనే శ్రీరాంసాగర్‌కు వరద వస్తుంది. కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న 15.50 టీఎంసీల నీటిని సాగుకంటే తాగునీటి అవసరాలకు అ ధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
రైతుల పరిస్థితి అగమ్యగోచరం
పెట్టుబడులు పెట్టి విత్తనాలు వేసిన రైతులు వానల కోసం ఆకాశం వైపు చూస్తుండగా.. మరోవైపు సాగు నీరు రాక లక్షల ఎకరాల ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బోర్లు, బావుల్లో కూడా నీరు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తు న్నా, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మరోవైపు ప్రాజెక్టుల్లోని పరిమిత నీటిని సాగుకంటే తాగునీటికే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి వరదలు వస్తే నే జూరాల, శ్రీరాంసాగర్‌లకు ఊరట లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు రైతు చూపంతా ఆకాశంపైనే నిలిచిపోయింది.






