20 July, 2026 | 9:18 PM

ప్రజారోగ్య పరిరక్షణలో వెనక్కి తగ్గేదిలేదు

20-07-2026 02:45 AM
  1. ఆహార కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాం
  2. ప్రజలు ఉత్పత్తులను పరిశీలించి కొనుగోలు చేయాలి
  3. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

బంజారాహిల్స్, జూలై 19 (విజయక్రాంతి): ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో హైదరాబాద్ సిటీ పోలీస్ వెనక్కి తగ్గేది లేదని టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్పష్టం చేశారు. ఇటీవల నగరంలోని వివిధ ప్రముఖ ఆహార విక్రయ, తయారీ కేంద్రాల్లో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఆహార కల్తీని అరికట్టడానికి, ఆహార భద్రత నిబంధనలను అమలు చేయడానికి హెచ్-ఫాస్ట్ కట్టుబడి ఉందన్నారు. అందుకోసం జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోందని వివరించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కల్తీకి పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండరడ్స్ యాక్ట్ 2006 ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు వారిని అప్పగించామన్నారు.

బహదూర్ పురలోని కేఓపీ అప్రోటెక్ లిమిటెడ్, కిషన్ బాగ్ లోని స్నాజీ ఐస్ క్రీమ్, సికింద్రాబాద్ మైలార్ గడ్డలోని వీరభద్ర ఎంటర్ ప్రైజెస్, ట్విన్ సిటీస్ ఎంటర్ ప్రైజెస్, మల్కాజిగిరిలోని ఎస్‌ఎస్ బేకరీ, బేగంబజార్లోని ఎంఎం కిరాణా అండ్ డ్రై ఫ్రూట్స్ స్టోర్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. ప్రముఖంగా కృత్రిమ రంగుల వినియోగం, తప్పుడు లేబులింగ్ చేయడం, సరైన రికార్డుల నిర్వహణ లేకపోవడం, కీటకాలు, బొద్దింకల సంచారం, పరిశుభ్రతా లోపం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేకపోవడం వంటివి తనిఖీల్లో తేలాయన్నారు.

ఆహార భద్రత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆహార కల్తీ చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని డీసీసీ స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఉత్పత్తులను కొనుగోలు చేసేముందు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, తయారీ, ముగింపు గడువులు, లేబులింగ్ సరి చూసుకోని కొనుగోలు చేయాలని సూచించారు. ఆహార కల్తీ, అపరిశుభ్ర వాతావరణంలో తయారీ వంటి కార్యకలాపాలపై హెచ్-ఫాస్ట్ అధికారులకు 87126 61212 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా సమాచారం ఇవ్వొచ్చిన వెల్లడించారు. ఆహార కల్తీ నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని డీసీపీ వైభవ్ రఘునాథ్ కోరారు.