20 July, 2026 | 8:29 PM

అక్రమార్కుల బరితెగింపు

20-07-2026 02:01 AM
  1. మేడ్చల్ ఎస్‌ఆర్ కార్యాలయం ప్రహరీ కూల్చివేత 
  2. ఆపై గేటు నిర్మాణం 
  3. నిందితుల వివరాలు తెలిసిన విచారణలో జాప్యం 

మేడ్చల్, జూలై 19 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్రమార్కులు బరితెగించారు. ఏకంగా జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రహరీని కూల్చివేశారు. తమ రాకపోకలకు అనుకూలంగా ప్రహరీ కూల్చేసి గేటు నిర్మించారు. ప్రహరీ కూల్చివేసి గేటు నిర్మాణం జరిగే వరకు సంబంధిత అధికారులు పట్టించుకోకుండా, అంతా పూ ర్తయిన తర్వాత మొక్కుబడిగా పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చేశారు. అధికారులకు ముం దస్తు సమాచారం మేరకే ప్రహరీ కూల్చివేత గేటు నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మేడ్చల్‌లోని జిల్లా, సబ్ రిజిస్ట ర్ కార్యాలయాలు మొన్నటి వరకు జాతీయ రహదారి పక్కన అద్దె భవనంలో కొనసాగాయి. మేడ్చల్ జిల్లా అర్బన్ జిల్లాగా మా రడంతో మేడ్చల్ లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాలు ఖాళీ అ య్యాయి. ఇటీవల ప్రభుత్వం అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయాలన్నీ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో రెండు అంతస్తులు ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయంలోకి జిల్లా, సబ్ రిజిస్టర్ కార్యాలయా లను ఇటీవల తరలించారు. ఈ కార్యాలయాలు తరలించడంతో ఈ ప్రాంతంలో రద్దీ పెరిగింది. దుకాణ సముదాయాలకు డి మాండ్ ఏర్పడింది. అద్దెలు కూడా బాగా పెరిగిపోయాయి. వెనుక భాగంలోకి వెళ్లడానికి ముందు గేటు నుంచి చుట్టూ తిరిగి వెళ్ళాలి. దీంతో కొంతమంది స్వార్థ ప్రయోజనాలతో నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీని కూల్చివేసి గేటు నిర్మించారు. 

ఫిర్యాదు చేసిన అధికారులు.. 

ప్రహరీ అక్రమంగా కూల్చివేత, గేటు నిర్మాణంపై సంబంధిత అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. గేటు కూల్చివేసి నిర్మిస్తున్నప్పుడే ఫిర్యాదు చేయాల్సింది. కానీ పూర్తయిన త ర్వాత పథకం ప్రకారం ఫిర్యాదు చేశారు. ప్రజల ఆస్తి కాపాడడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని, వీరిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

మొక్కుబడిగా విచారణ..

ప్రహరీ కూల్చివేత గేటు నిర్మాణంపై సబ్ రిజిస్టర్ ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ విచారణ మొక్కుబడిగా సాగుతోంది. ప్రహరీ కూల్చి గేటు నిర్మించాల్సిన అవసరం ఎవరికి ఉందో అక్కడ చూస్తే అర్థమవుతుంది. కానీ పోలీసులు కాలయాపన చేస్తున్నారు.

ప్రతిరోజు పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నప్పటికీ నిందితులను మాత్రం పట్టుకోవడం లేదు. ఏసీపీ శంకర్ రెడ్డి కూడా ప్రహరీ కూల్చివేత గేటు నిర్మాణాన్ని పరిశీలించారు. ఇప్పటికైనా పోలీసులు నిందితులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గేటు తొలగించి ప్రహరీ నిర్మించాలని కోరుతున్నారు.