19 June, 2026 | 3:30 AM

ఉద్యమకారులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి

19-06-2026 02:12 AM

మహాగర్జనలో పలువురు డిమాండ్

హాజరైన బీసీ జాక్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్,  కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోతె శోభన్‌రెడ్డి, ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ సత్యనారాయణ

ముషీరాబాద్, జూన్ 18(విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుల సంక్షేమానికి తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఉద్యమ కారుల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారులు మహాగర్జన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మోతే శోభన్‌రెడ్డి, బీసీ జాక్ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, తెలంగాణ ఉద్యమ కారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ బడా కాంటాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ఉద్యమకారులపై లేకపోవడం బాధాకరమన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందిని ఆయన మండిపడ్డారు. మోతే శోభన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ నివేదిక ఆధారంగా న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిజమైన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం  గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని ఆయన తెలిపారు.

అనంతరం నరాల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మామీల ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలంతో పాటు భారత స్వాతంత్య్ర సమాన్ ఏ వన్ గ్రేడ్ కింద రూ.50వేల పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల అర్హులైన పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక కోటా కల్పించాలన్నారు.

తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమానికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించి, వారిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమకారులతో కలిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జాక్ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ఉద్యమకారుల వేదిక వైస్ చైర్మన్ టీ శంకర్‌గౌడ్ తోపాటు ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.