శివసేన యూబీటీలో చీలిక ఖరారు!
- పార్లమెంటరీ పార్టీ భేటీకి ఆరుగురు ఎంపీలు డుమ్మా
- 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలే హాజరు
- గైర్హాజరు ఎంపీలకు షోకాజ్ నోటీసులిస్తాం
- దీన్ని వ్యూహం అనరు.. ఇది ద్రోహమే
- ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్
- ఏక్‌నాథ్ సిండే శిబిరంలోకి వేగంగా రెబల్ ఎంపీల ప్రక్రియ
ముంబై, జూన్ 18: మహారాష్ట్రలో గత లోక్ సభ ఎన్నికలకు ముందు శివసేనలో చోటు చేసుకున్న చీలిక తరహాలోనే ఇప్పుడు మరోసారి చీలిపోయేందుకు రంగం సిద్ధమైంది. గత లోక్ సభ ఎన్నికల్లో కేవలం ఆరు ఎంపీల్ని మాత్రమే గెల్చుకున్న శిండే నేతృత్వంలోని శివసేన కన్ను మరోసారి ఉద్ధవ్ సేనపై పడింది. దీంతో ఉద్ధవ్ సేనకు ఉన్న 9 మంది ఎంపీల్లో మెజార్టీ ఎంపీల్ని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కొన్ని రోజులుగా శివసేన ఉద్ధవ్‌టాక్రే వర్గానికి ఉన్న 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే సేనకు వెళ్లిపోతున్నారన్న ప్రచారం మొదలైంది. దీనిపై అటో ఇటో తేల్చేయడానికి సిద్ధమైన ఉద్ధవ్‌టాక్రే గురువారం ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ భేటీ ఏర్పాటు చేశారు. ఈ భేటీకి కేవలం ముగ్గురు ఎంపీలే హాజరు కాగా, మిగతా ఆరుగురు డుమ్మా కొట్టారు. దీంతో ఊహించిన ట్లుగానే ఉద్ధవ్ సేన మరోసారి చీలిపోయేందు కు రంగం సిద్ధమవుతోంది.
శివసేన(యూబీటీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఈ సమావేశానికి ముగ్గురు లోక్‌సభ ఎంపీలు అరవింద్ సావంత్, రాజాభావు వాజే, అనిల్ దేశాయ్ హాజరయ్యారని, తాను రాజ్యసభ సభ్యుడిని, సమావేశానికి హాజరుకాని ఎంపీలు పార్టీ విప్‌ను ఉల్లంఘించినట్లు తేలిందన్నారు. అందుకే వారిపై చర్య లు ప్రారంభించామన్నారు. వారికి ‘షోకాజ్’ నోటీసు జారీ చేసి, వివరణ కోరతామని తెలిపారు.
వారి సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా చర్య లు తీసుకుంటామన్నారు. నిన్న తాము స్పీకర్‌ను కలిసిన ఫొటో విడుదల చేశామని, ఒకవేళ మిగిలిన ఆరుగురు ఎంపీలు కూడా స్పీకర్‌ను కలిసి ఉంటే, దానికి సంబంధించిన ఫొటోను తమకు చూపించాలన్నారు. దీన్ని వ్యూహం అనరు, ఇది ద్రోహం. వారు ఇప్పటికీ తమ పార్టీ సభ్యులే, తమ పార్టీ గుర్తుపైనే గెలిచారన్నారు. వారు పార్టీ విప్‌ను ఉల్లంఘిం చి ఉంటే, చట్టపరమైన చర్యలను ఎదుర్కోవా ల్సి ఉంటుందన్నారు.
బీజేపీ దేశ రాజకీయాలను, ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసింది, దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సంజయ్ రౌత్ హెచ్చరించారు. సమావేశానికి ఎంపీలు హాజరు కాకపోవడంపై ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత అరవింద్ సావంత్ కూడా స్పందించారు.
‘ఈ సమావేశానికి సంబంధించి ‘విప్’ జారీ చేసినప్పటికీ వారు ఎందుకు హాజరుకాలేదో అడుగుతాం. వారికి సమాధానం ఇవ్వడానికి ఏడు రోజుల గడువు ఇస్తాం. ఒకవేళ వారు స్పందించకపోతే, వారి అనర్హతను కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తాం’ అని శివసేన (యూబీటీ) లోక్‌సభ ఫ్లోర్ లీడర్ అరవింద్ సావంత్ పేర్కొన్నారు.
శిండే శివసేనలోకి చకచకా ఆరుగురు ఎంపీల ప్రక్రియ
శివసేన యూబీటీ రెబల్ ఎంపీలు తమ ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే సారథ్యంలోని శివసేనలో విలీనం చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఓ లేఖ సమర్పించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. లోక్‌సభలో తమకు వేరుగా సీట్లు కేటాయించాలని వారు లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపినట్లు తెలిసింది.
సంతకాల పరిశీలన జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. విలీన ప్రక్రియ పూర్తి కావటానికి కొన్నిరోజుల సమయం పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ధ్రువీకరణ కోసం కొందరు ఎంపీలు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పీకర్ కార్యాలయం భావిస్తోంది. రాబోయే రోజుల్లో అది జరుగుతుందని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.






