రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
భర్త, కుమారునికి తీవ్రగాయాలు
చేగుంట: జాతీయ రహదారి 44పై జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మహిళ మృతిచెందగా, భర్త, ఆరేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పాటి చందూ, ఆయన భార్య పాటి లక్ష్మీ, చిన్నారి తనయ్ శనివారం మాసాయిపేట మండలం రామంతాపూర్ లోని జాన్ స్కూల్ కు వెళ్లి ఫీజులు చెల్లించుకుని, తిరిగి తమ గ్రామానికి వస్తున్నారు.
ఈ సమయంలో వెనుక నుండి వచ్చిన కంటైనర్ లారీ బైకును ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పాటి లక్ష్మీ అక్కడికక్కడే మృతిచెందగా, చందు తలకు తీవ్ర గాయాలు కాగా చిన్నారి తనయకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ పైలెట్ భాను సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన తండ్రి, కుమారుడిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూప్రాన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






