ఆకాశరామన్న ప్రకటనకు అద్భుతమైన అల్లిక
- రాష్ట్ర విభజన జరిగిన రెండేండ్లకే ఉద్యోగుల విభజన కొలిక్కి వచ్చిందంటూ కలరింగ్
- తెలంగాణకు ఉద్యోగులు వస్తున్నది అసత్యమని రాస్తూనే 1,808 మంది ఏపీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చారని స్పష్టం
- సీఎం, సీఎస్, ఐఅండ్‌పీఆర్ నుంచి ప్రకటన రాకున్నా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయంటూ నమ్మబలికే ప్రయత్నం
- కొన్ని మీడియా సంస్థలపై మండిపడుతున్న తెలంగాణ ఉద్యోగులు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 18 (విజయక్రాంతి): తెలంగాణ సచివాలయంలోకి 1,808 మంది ఏపీ ఉద్యోగులు వస్తున్నారు.. ఇందుకు సబంధించిన ఫైల్‌ను సీఎస్ శాంతి కుమారి సీఎం వద్దకు తీసుకెళ్లారు.. సీఎం సంతకం చేస్తే ఏపీ ఉద్యోగులు తెలంగాణలోకి చొరబడుతారు.. వీరిలో 87 మంది సచివాలయ సెక్షన్ అధికారులు కూడా ఉన్నారు.. ఈ ఫైల్‌పై సీఎం సంతకం చేయవద్దు.. చేస్తే తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
ఈ విషయంపై 2024 జూన్ 13వ తేదీన తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ (టీఎస్‌ఎస్‌ఏ), డా.బీ.ఆర్. ఆంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఎంప్లాయ్స్ అసోసియేషన్ (ఏటీఎస్‌ఈఏ) 2024 జూన్ 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించారని, జీఏడీలో ఈ ఫైల్ కదలికలపై అందిన పక్కా సమాచారంతోనే ‘విజయక్రాంతి’ పత్రిక ఈ నెల 16వ తేదీన ‘సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫైల్‌ను ఎవ్వరు పెట్టమన్నారని, నేను చెప్పినా వినరా అంటూ తెలంగాణ ఉద్యోగుల సాక్షిగా సీఎస్ శాంతి కుమారిపై ఆసహనం వ్యక్తం చేశారు.
ఏపీ ఉద్యోగుల ఫైల్‌ను సీఎం రేవంత్ రెడ్డి తిప్పి పంపారు. ఇదే విషయాన్ని విజయక్రాంతి జూన్ 17వ తేదీన ‘నేను చెప్పినా వినరా’ శీర్షికతో మళ్లీ కథనం ప్రచురించింది. ఈ రెండు కథనాలు కూడా తెలంగాణవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఏపీ ఉద్యోగులు, అధికారుల కుట్రలకు విజయక్రాంతి కథనం బ్రేకులు వేసిందని తెలంగాణవాదులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల వాయిస్‌ను ప్రతిబింబించేలా ‘విజయక్రాంతి’ పత్రిక ప్రచురించిన వరుస కథనాల పట్ల తెలంగాణ సచివాలయ ఉద్యోగులతో పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ప్రజా సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలొగ్గొద్దని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మళ్లీ సీమాంధ్ర నాయకులకు తాకట్టు పెట్టొద్దని సూచించారు.
రంగంలోకి దిగిన కొన్ని మీడియా సంస్థలు
తెలంగాణ ఆకాంక్షలను విస్మరిస్తూ ఏపీ ఉద్యోగులను తెలంగాణలోకి అనుమతించవద్దని తెలంగాణ సచివాలయ ఉద్యోగులు మొరపెట్టుకున్నా, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, సీఎస్‌కు వినతి పత్రాలు అందించినా పట్టించుకోని ఆ మీడియా సంస్థలు, ఓ ఆకాశరామన్న విడుదల చేసిన అబద్దపు ప్రకటనకు అద్భుతమైన అల్లికను జోడించాయి. రాష్ట్ర విభజన జరిగిన యేడాది, రెండేండ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందంటూ నమ్మబలికే ప్రయత్నం చేస్తూనే.. 1,808 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చారంటూ మంగళవారం ప్రచురించాయి. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి ౧,౩౬౯ మంది వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారని పేర్కొన్నాయి. అయితే ఏపీ నుంచి అదనంగా ౪౩౯ మంది, అలాగే సచివాలయంలోకి సెక్షన్ అధికారులుగా చొరబడాల నుకున్న ౮౭ మందికి సంబంధించిన విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాయి.
పాత ఫైల్ దుమ్ముదులిపి..
ఎప్పుడో పక్కన పడేసిన ఏపీ ఉద్యోగుల తెలంగాణ ఎంట్రీ ఫైల్ దుమ్ము దులిపిన సీమాంధ్ర మూలాలు ఉన్న సీఎస్ శాంతికుమారి పొరపాటును కవర్ చేసేందుకు ఆ మీడియా సంస్థలు స్వయంగా రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా ఎవరో ఆకాశరామన్న రాసిన ఓ అబద్ధపు ప్రకటన సృష్టించి తెలంగాణలోకి ఏపీ ఉద్యోగులు వస్తున్నారని జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ‘ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి’ అని కొన్ని పత్రికలు తప్పుడు కథనాలను ప్రచురించాయి. తెలంగాణ యాజమాన్యంలో నడుస్తున్న వెలుగు పత్రిక కూడా సీమాంధ్ర మీడియా దారిలోనే ఏపీ నుంచి తెలంగాణకు ఉద్యోగులెవరూ రావట్లే అంటూ ఓ కథనం అల్లుకొచ్చింది.
కానీ వాళ్లు రాసిన కథనంలోనే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు 1,808 మంది ఆప్షన్లు ఇచ్చారని, అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది ఆప్షన్లు ఇచ్చారని, ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లుగా కథనాలను అల్లాయి. అయితే తెలంగాణ సీఎం కార్యాలయం, సీఎస్ కార్యాలయం, ఐఅండ్‌పీఆర్ శాఖ నుంచి మాత్రం ఈ ప్రకటన జారీ కాలేదు. ఇది సీమాంధ్ర మీడియా సృష్టించినదా లేక ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో సీఎంలో సీమాంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులు సృష్టించారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
స్థానికతను విస్మరించిన వైనం..
ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న వారిలో తెలంగాణ స్థానికత ఉన్నవాళ్లు కేవలం 5 శాతం మంది మాత్రమే కాగా, ఏపీ స్థానికత కలిగిన 95 శాతం మంది తెలంగాణకు వస్తున్నారని, ఈ విషయాన్ని సీమాంధ్ర మీడియా రాయలేదు.. కనీసం తెలంగాణ మేనేజ్‌మెంట్‌లో నడుస్తున్న వెలుగు పత్రిక కూడా రాయలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చిన 1,369మంది ఉద్యోగులలో 98 శాతం మంది ఏపీ స్థానికత కలిగిన వారే ఉన్నారని తెలంగాణ ఉద్యోగులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ఉద్యోగులకు నష్టం జరుగుతున్నా పట్టించుకోలేదు కానీ, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే మాత్రం సీమాంధ్ర మీడియాతోపాటు వెలుగు వంటి పత్రికలు కూడా తెలంగాణలో చీకట్లను కోరుకుంటున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల, ఉద్యోగుల ఆకాంక్షలను వక్రీకరిస్తే సీమాంధ్ర మీడియాకు తెలంగాణలో క్రమంగా ఆదరణ తగ్గుతుందని తెలంగాణ ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.






