22 May, 2026 | 5:00 AM

నీట్‌కు వ్యతిరేకంగా ఫైట్

19-06-2024 12:26 AM
  • రద్దు చేయాలని కదం తొక్కిన విద్యార్థులు
  • రాజధాని నగరంలో స్టూడెంట్ మార్చ్
  • కేంద్ర మంత్రులను తిరగనివ్వమని హెచ్చరిక

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): నీట్  2024 నిర్వహణలో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని నారాయణగూడ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో  వందలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘స్టూడెంట్ మార్చ్’ కు విద్యార్థులు తరలి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నీట్‌ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ ప్రదీప్, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురాంరెడ్డి మాట్లాడుతూ నీట్ కుంభకోణంపై  కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని, లేదంటే వారిని తెలంగాణలో తిరుగనివ్వబోమని, వారిళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

స్టూడెంట్ మార్చ్‌కు విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మద్దతు తెలిపి మాట్లాడారు. నీట్  సమస్యపై కేంద్రం స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  పి.లక్ష్మణ్, కే మణికంఠరెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీకాంత్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పరశురాం, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకురాలు చందనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓయూలో ఎన్‌టీఏ దిష్టిబొమ్మ దహనం

నీట్ పేపర్ లీక్ ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిళి వెంకట్‌రెడ్డి, ఏఐడీఎస్‌వో రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్, యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఉమెన్స్ హాస్టల్ వరకు  విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు.  విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాలోత్ రాజేష్, రంజిత్, అభిషేక్, నిఖిత్, మహేష్, మమత, మౌనిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.