17 August, 2026 | 1:24 AM

సీపీఎస్ రద్దు.. పాత పెన్షన్ సాధనే లక్ష్యం

17-08-2026 12:48 AM

గజ్వేల్ నుంచి నాచారం వరకు 20 కి.మీ. ఉద్యోగ, ఉపాధ్యాయుల పాదయాత్ర

గజ్వేల్, ఆగష్టు16: సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కదం తొక్కారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గజ్వేల్ డివిజన్ ఉద్యోగులు గజ్వేల్ నుంచి నాచారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర నిర్వహించారు. ఆగస్టు 23న హైదరాబాద్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన ఈ పాదయాత్రలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీపీఎస్ వల్ల ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక, సామాజిక భద్రతపై అనిశ్చితి నెలకొంటోందని నాయకులు పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగుల భవిష్యత్కు సామాజిక భద్రత కల్పిస్తుందని, దానిని పునరుద్ధరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డివిజన్ అధ్యక్షులు వెలుగు నరేందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్చారి, కోశాధికారి నరేష్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది.

రాష్ట్ర ఉపాధ్యక్షులు కురాకుల శ్రీనివాస్, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి అమరేందర్గౌడ్, జిల్లా కోశాధికారి ఎల్మ రాజు పాల్గొన్నారు. పాదయాత్రలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటుకున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి సురేష్, ఉపాధ్యాయుల ప్రగతిశీల సమాఖ్య జోన్ కన్వీనర్ జె. శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య మండల అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదని నాయకులు స్పష్టం చేశారు. ఆగస్టు 23న హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.