చోరీకి గురైన 8 బైక్‌లు స్వాధీనం
- మొయినాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తులో వాహనాల రికవరీ
- ముగ్గురు అదుపులోకి..
మొయినాబాద్, ఆగస్టు 16(విజయ క్రాం తి): వాహన చోరీ కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన మొయినాబాద్ పోలీసులు 8 ద్వి చక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ష హబాజ్ (19)తో పాటు ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు ల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం అజీజ్నగర్ పాత రహదారిపై అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా వాహన చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వారి సమాచారం మేరకు హైదరాబాద్లోని కాలాపత్తర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి మరో ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల రిసీవర్గా ఉన్న మహ్మద్ ఇంతియాజ్ (26) వద్ద నుంచి మరో పల్సర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం స్వాధీనం చేసుకున్న వాహనాల్లో మొయినాబాద్ పోలీస్స్టేషన్కు చెందిన ఐదు, చేవెళ్లకు చెందిన రెండు, షాబాద్ పోలీస్స్టేషన్కు చెందిన ఒక వాహనం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హోండా డియోకు సంబంధించిన ఇంజిన్, రెండు చక్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. వాహన చోరీల్లో మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.






