విద్యుత్తు శాఖలో ఏసీబీ దాడులు
19 వేలు తీసుకుంటూ చిక్కిన ఎస్‌ఈ, డీఈ, ఏఈ
వనపర్తి, మే 31(విజయక్రాంతి): ఓ రెస్టారెంట్‌కు త్రీఫేస్ కరెంటు కనెక్షన్ ఇచ్చేందుకు రూ.౧౯ వేలు లంచం తీసుకుంటూ వనపర్తి విద్యుత్తు శాఖ ఎస్‌ఈ నాగేంద్రకుమార్, డీఈ నరేంద్రకుమార్, ఏఈ మధూకర్ శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వనపర్తి డివిజినల్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ ఆపరేషన్ కార్యాలయంలో ఏసీబీ డిఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకొట మండలం నిర్వెన గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ నాలుగేండ్లుగా విద్యుత్తు శాఖ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు.
ఆయన బంధువు లక్ష్మీనారాయణ కొత్తకోట మండలం పాలెం శివారులో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. రెస్టారెంట్ కోసం త్రీఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ కావాలని ఏప్రిల్ 2న ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 16న కొత్తకోట ఏఈకి సంబంధిత ఆన్‌లైన్ పత్రాలను అందజేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు అయ్యే రూ.2.౪౦ లక్షల ఎస్టిమేషన్ వేసి వనపర్తి డీఈ కార్యాలయానికి పత్రాలను పంపించారు. 20న డీఈ కార్యాలయానికి వచ్చి డీఈ నరేంద్రకుమార్‌ను కలువగా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కావాలంటే రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చివరకు రూ.19 వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, ప్రణాళిక ప్రకారం విద్యుత్తు అధికారులకు లంచం ఇస్తున్న సమయంలో దాడులు నిర్వహించి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, శనివారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు.






