22 July, 2026 | 4:44 PM

కూచిపూడి నాట్యప్రభ అను‘దీప్తి’

01-06-2024 03:08 AM

కాశీ దేవాలయంలో  వందల ప్రదర్శనలు

గ్రామీణ ప్రాంత బాలబాలికలకు కూచిపూడిలో శిక్షణ

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (విజయక్రాంతి) : ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి అనుదీప్తి. పసితనం నుంచే కూచిపూడి నృత్యంపై ఆమె మక్కువ పెంచుకుంది. అనుదీప్తిలో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనను గుర్తించిన తల్లిదండ్రులు చదువుతో సమానంగా కూచిపూడి నృత్యంలోను శిక్షణ ఇప్పించారు. బీటెక్ పూర్తి అయిన వెంటనే ఆమెకు ఐటీ సంస్థలలో ఉద్యోగాలు వచ్చినప్పటికీ, తనకు ఇష్టమైన కూచిపూడి నృత్యంపై దృష్టి సారించి భారతదేశ సంప్రదాయ నృత్యంంలో అగ్రస్థానంలో ఉన్న కూచిపూడి నృత్యంపై ఆమె సంపూర్ణమైన పట్టు సాధించింది. తాను నేర్చుకోవడంతో భవిష్యత్ తరాలకు నేర్పాలనే సంకల్పంతో కరీంనగర్ జిల్లా కాలేశ్వరంలో పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు కూచిపూడిలో శిక్షణ ఇచ్చి ఆ ప్రాంత చిన్నారులకు కూచిపూడి నృత్యంపై ఆసక్తిని పెంపొందించారు. అలాగే కాప్రా ప్రాంతంలో శ్రీలక్ష్మీ కూచిపూడి డ్యాన్స్ అకాడమిని స్థాపించి సుమారు 200మంది బాలబాలికలకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చిన అనుదీప్తి కూచిపూడి నాట్యప్రభగా కీర్తిని గడిస్తుంది.

శ్రీ లక్ష్మీ కూచిపూడి డ్యాన్స్ అకాడమి 5వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో తాను శిక్షణ ఇచ్చిన సుమారు 80మంది బాలబాలికలతో కలిసి భైరవి, భారవి ఆనంద వంటి నృత్యాలతో చూపరులను కనువిందు చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ హిందువులు అత్యంత పవిత్రమైన దేవస్థానంగా ఆరాదించే కాశీ దేవాలయ వేడుకల్లో ఇప్పటి వరకు తన బృందంతో వందల ప్రదర్శణలు ఇచ్చానని తెలిపారు. అవకాశం వస్తే భవిష్యత్‌లో అంతర్జాతీయ వేడుకలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కూచిపూడి నృత్యంపై తనకు ఉన్న ఆసక్తిని, పట్టుదలను గుర్తించి తన తల్లిదండ్రులు శిక్షణ ఇప్పించారని, ప్రస్తుతం తన భర్త విజయ్ ప్రోత్సాహంతో శ్రీలక్ష్మీ కూచిపూడి డ్యాన్స్ అకాడమిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని తెలిపారు. వందలమంది విద్యార్థుల తల్లితండ్రుల ప్రోత్సాహంతో శ్రీలక్ష్మి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ 5వ వార్షికోత్సవం వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

అనుదీప్తిని వరించిన అవార్డులు

ప్రతిష్ఠాత్మకమైన ‘కళారత్న’ జాతీయ అవార్డు విజేత, కళావిజ్ఞాన్, నాట్య రత్న, నాట్య కౌసల్య ఆచార్య నాట్య శిఖర అవార్డు  యూడీఏ అవార్డ్  2023, బెస్ట్ టీచర్స్ అవార్డ్ 2022, జాతీయ ఐదో డ్యాన్స్, మ్యూజిక్ ఛాంపియన్, ఏటూఏ ఈవెంట్స్ ఫైనలిస్ట్, కోటి దీపస్తర 2022, 2024, శివ పంచాక్షం మహానాట్య బృందంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎన్టీఆర్ అవార్ట్  2023, సేవా రత్న అవార్డ్  2023, ఉగాది పురస్కారం, ఎక్సలెన్స్ అవార్డ్  2022, 2023, నాట్య మయన్, బెంగాల్‌లోని సూరోభారతి ఆధ్వర్యంలో కూచిపూడిలో డిస్ట్రింక్షన్ సాధించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో డిప్లమా పూర్తిచేశారు.