12 August, 2026 | 1:18 AM

ఈ నెల 31 వరకు కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

12-08-2026 12:11 AM
  1. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
  2. కలెక్టర్ రాజర్షి షా వెల్లడి

ఉట్నూర్, ఆగస్టు 11 : ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త పింఛన్ల కోసం ఈ నెల ఆఖరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పథకం కింద నూతన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నవీకరణ ప్రక్రియను ఐటిడిఏ పీఓ మంద మకరందుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్ల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అర్హులైనవారు దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఫొటో, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ జతచేయాల్సి ఉంటుందన్నారు. వితంతు పింఛన్ల కోసం గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలని, చేనేత, గీత కార్మికుల దరఖాస్తులను ఎక్సైజ్, హ్యాండ్లూమ్ శాఖల సమన్వయంతో పరిశీలిస్తామన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవో రైసుల్లా, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.