డిసెంబర్‌లో ఖేలో ఇండియా
- యూత్ గేమ్స్ 2026ను విజయవంతం చేయాలి
- క్రీడా స్ఫూర్తిని చాటేలా పోటీలు నిర్వహించాలి
- సమీక్షలో -సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా ఈ పోటీలను డిసెంబర్‌లో నిర్వహించేదుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ క్రీడలను విజయం వతం చేయడానికి అధికారులు కృషి చేయాలని అన్నారు.
మంగళవారం ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని స్టేడియంలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడాపోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ, ముగింపు వేడుకల ముఖ్యఅతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖుల ను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. తెలంగాణ కు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్ తో పాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేష్‌రంజన్, శాట్ ఎండీ సోనీబాలదేవి తదితరులు పాల్గొన్నారు.






