12 August, 2026 | 1:34 AM

కేరళం పేరు మార్పు బిల్లుకు ఆమోదం

12-08-2026 12:27 AM
  1. కో--ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లుకు కూడా..
  2. రెండు బిల్లులను ఆమోదించిన లోక్‌సభ
  3. వర్షాకాల సమావేశాల్లో 17వ రోజూ గందరగోళం
  4. ఉభయ సభలతోపాటు ‘పార్లమెంట్’ వెలుపలా విపక్షాల నిరసన
  5. ఢిల్లీలో లాఠీచార్జీపై కేంద్ర హోమంత్రి అమిత్ షా సమాధానమివ్వాలని డిమాండ్
  6. రాంచీ విద్యార్థులపై జార్ఖండ్ ప్రభుత్వ పోలీస్ చర్యపై ఎన్టీయే కూటమి ఎంపీలు ఫైర్
  7. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్

న్యూఢిల్లీ, ఆగస్టు ౧౧: పార్లమెంట్ వర్షాకా ల సమావేశాలు మంగళవారం ౧౭వ రోజూ గందరగోళం మధ్యే నడిచాయి. విపక్షాల డిమాండ్లతో ఉభయ సభల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఉదయం 11 గంటలకు రెండు సభలు ప్రారంభం కాగానే విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. గతనెల ౨౦న ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై కేంద్ర మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని, అయోధ్య రామ్‌మందిర్ నిధుల దుర్వినియోగంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశాయి.

లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ ‘కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిలు’్లను, అలాగే, సహకారశాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ‘నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సవరణ) బిల్లు’ను ప్రవేశపెట్టారు. విపక్షాల గందరగోళం మధ్యే స్పీకర్ ఓం బిర్లా రెండు బిల్లులపై మూజువాణి ఓటింగ్ నిర్వహించారు.

ఓటింగ్‌లో ఎలాంటి చర్చ లేకుండానే రెండు బిల్లులూ సభ ఆమోదం పొందాయి. మొదటి బిల్లు ద్వారా కేరళ పేరును ‘కేరళం’గా మార్చడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రెండో బిల్లు ద్వారా దేశీయ సహకార రంగాన్ని బలోపేతం చేయడం, రైతులకు సులభమైన పద్ధతిలో రుణాలు మంజూరు, తద్వారా గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యం. మరోవైపు, రాజ్యసభలో సైతం సభాకార్యకలాపాలు ఏమాత్రం ముందుకు సాగలేదు. 

ఉదయం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభ్యులను శాంతించమని కోరినప్పటికీ నిరసనలు తగ్గలేదు. దీంతో సభలో ఎలాంటి బిల్లులు చర్చకు రాలేదు. మొత్తానికి లోక్‌సభ, రాజ్యసభ రెండూ బుధవారా నికి వాయిదా పడ్డాయి.

వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. సమావేశాలు తుదిదశకు చేరుకుంటుండటంతో అధికార, విపక్షాల మధ్య పంతం మరింత పెరిగింది. 13వ తేదీతో ఈ సెషన్ ముగియనున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుల పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు మొదలైంది.

ఇరు కూటముల పోటాపోటీ నిరసనలు

అధికార, విపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఆవరణ దద్దరిల్లింది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధా నం ఇవ్వాలని, అలాగే.. అయోధ్య రామ్‌మందిర్ విరాళాల దుర్వినియోగంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి సభ్యులు నిరస న చేపట్టారు.

నిరసనలో కాంగ్రెస్ ఎంపీ లు ప్రియాంక గాంధీ, మాణికం ఠాగూర్, ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, ఎంపీ జయాబచ్చన్‌తోపాటు పలువురు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. మరోవైపు, ఝార్ఖండ్‌లో విద్యార్థులపై పోలీసు ల లాఠీఛార్జీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు నోరు విప్పడం లేదని ఎన్డీయే కూటమి ఎంపీలు నిలదీశారు. 

ఇండియా కూటమిలో భాగస్వామి అయిన హేమంత్ సోరన్ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ చర్యపై ఎందు కు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో ఎంపీలు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, అపరాజిత సారంగి, అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

ఎంపీ ప్రియాంకను అడ్డగింత

సభ సమావేశాలకు హాజరయ్యేందు కు ఉదయం పార్లమెంట్‌లోకి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఎన్డీయే కూట మి ఎంపీలు అడ్డుకున్నారు. జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎందు కు నోరు విప్పడం లేదని నిలదీశారు. ఈ విమర్శలకు ప్రియాంకగాంధీ చిరునవ్వుతోనే  సమాధానమిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూ టమికి చెందిన ఎంపీలు నిరసన ప్రదర్శన చేయడా న్ని చూడటం ఇదే మొదటి సారి అని ఎద్దేవా చేస్తూ, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

‘వందేమాతర’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

జాతీయ గేయం ‘జనగణమన’కు చట్టపరమైన భద్రత ఉన్న విధంగానే, వందేమా తర గీతానికి చట్టపరమైన భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ గౌరవ అవమానాల నిరోధక (సవరణ) బిల్లు -2026 తీసుకువచ్చింది. బిల్లును గత నెల ౨౯న రాజ్యసభ ఆమోదించగా, ఇదే నెల ౩౦న లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ఈ బిల్లుకు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో బిల్లు కాస్త, చట్టంగా మారనుంది. ఇకపై ఎవరైనా వందేమాతర గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా, ఆలపించే టప్పుడు అడ్డంకులు సృష్టించినా వారు శిక్షార్హులవుతారు. మరోవైపు, ఈ ౧౫న ఢిల్లీలోని ఎర్రకోటపై జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.