21 July, 2026 | 11:14 AM

దగ్గరైన ఉన్నత దూరవిద్య

21-07-2026 12:20 AM
  1. సర్వత్ర ఉన్నత విద్యకు సరికొత్త వేదికగా దూరవిద్య కేంద్రాలు
  2. ఉద్యోగులు, గృహిణులు, యువత, వ్యాపారులకు ఉన్నత చదువులు

సిద్దిపేట, జులై 20 (విజయక్రాంతి): కాలానుగుణంగా విద్యా విధానాలు మారుతున్న నేపథ్యంలో, చదువును మధ్యలో నిలిపివేసిన వారికి మరోసారి ఉన్నత విద్యను చేరువ చేసే ఉత్తమ అవకాశంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దూరవిద్య కేంద్రాలు దగ్గరవుతున్నాయి. ఉద్యోగం చేస్తూనే, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులను పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం వీటి ప్రత్యేకతగా నిలుస్తోంది.

సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దూరవిద్య అధ్యయన కేంద్రం ద్వారా అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వందలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ తమ విద్యార్హతలను మెరుగుపరుచుకుంటు న్నారు.

అందరికీ అందుబాటులోసాధారణ విద్యను కొనసాగించలేకపోయిన యువత, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు దూరవిద్యను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఉద్యోగానికి అవసరమైన అర్హతలు పెంపొందించుకోవడంతో పాటు పదోన్నతులకు కూడా ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయి.

విస్తృతంగా కోర్సులు

డిగ్రీ, పీజీతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు తదితర విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థుల ఆసక్తి, ఉద్యోగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ స్పెషలైజేషన్లలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

సౌకర్యవంతమైన అభ్యాసం

ప్రతిరోజూ కళాశాలకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా, వారాంతపు సంప్రదింపుల తరగతులు, అధ్యయన మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థులు సులభంగా చదువును కొనసాగించవచ్చు. అవసరమైన సమయంలో పరీక్షలు రాసి డిగ్రీని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

విద్యతో భవిష్యత్తుకు బాట

ఉన్నత విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు, పోటీ పరీక్షల్లో అర్హత సాధించేందుకు దూరవిద్య సమర్థవంతమైన మార్గంగా మారుతోంది. చదువు ఆగిపోయిందనే భావనను పక్కనబె ట్టి, జీవితంలో మరోసారి విద్యా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. సిద్దిపేట కేంద్రానికి ఈ కోర్సులు మంజూరుకు కృషి చేసిన కళాశాల ప్రిన్సిపల్, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు.

డాక్టర్. శ్రద్ధానందం,

 కోఆర్డినేటర్, సిద్దిపేట.