4 August, 2026 | 7:11 PM

బ్లాక్ మనీ పేరుతో రూ.13 లక్షలు మోసం చేసిన నిందితుడు అరెస్ట్

04-08-2026 05:49 PM

మోసానికి ఉపయోగించిన బ్లాక్ పేపర్లు, రసాయన ద్రావణాలు స్వాధీనం

డి ఎస్ పి వెల్లడి

అశ్వారావుపేట,(విజయక్రాంతి): బ్లాక్ మనీ పేరుతో రూ. 13 లక్షలు మోసం చేసిన నిందితుడిని  మంగళవారం అరెస్ట్ చేసినట్టు పాల్వంచ డి ఎస్ పి  సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఆయన వివరాలు వెల్లడించారు. అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో  పత్తిపాటి ప్రేమచంద్ అమాయకులను మోసం చేస్తున్నాడని తెలిపారు.  బ్లాక్ పేపర్లను ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచితే రూ.500 నోట్లుగా మారుతాయని నమ్మించి, రూ.11 లక్షలు తీసుకున్నట్లు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షల రూపాయలు  అశ్వారావుపేట  కు చెందిన మదుబాబు ను మోసం చేసినట్లు ఒప్పుకునట్టు డి ఎస్ పి తెలిపారు.

నిందితుడు గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్ సైకీళ్ళ దొంగతనం , ఇతర కేసుల్లో బాచుపల్లి, రామచంద్రపురం , కూకటపల్లి  పోలీస్ స్టేషన్లలో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది అని తెలిపారు. నిందితుడి వద్ద నుండి మోసానికి ఉపయోగించిన రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు (20 కట్టలు), బ్లాక్ పేపర్లను నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి, అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి

బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను నమ్మవద్దు. ఇటువంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని  పాల్వంచ డి ఎస్ పి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.