4 August, 2026 | 6:59 PM

ప్రజల కోసం స్వయంగా రంగంలోకి దిగిన వార్డు సభ్యుడు పరశురాములు

04-08-2026 05:46 PM

- 5వ వార్డులో గడ్డి మందు పిచికారీ

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని 5వ వార్డులో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యుడు పరశురాములు స్వయంగా రంగంలోకి దిగారు. వార్డులో పేరుకుపోయిన సమస్యలను స్థానిక సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో ఆయన స్వయంగా చర్యలు చేపట్టారు.వార్డులో విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి కారణంగా దోమల ఉద్ధృతి పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, పరశురాములు పిచికారీ పంపును భుజాన వేసుకుని గడ్డి మందు పిచికారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మా వార్డు ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత మాకు అత్యంత ముఖ్యం. అధికారులు, పాలకవర్గం స్పందించకపోయినా ప్రజాప్రతినిధిగా నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వార్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలి" అని కోరారు.ప్రజల క్షేమం కోసం స్వయంగా శ్రమించి పారిశుద్ధ్య పనులు చేపట్టిన వార్డు సభ్యుడు పరశురాములను స్థానికులు అభినందిస్తూ, వార్డులో మిగిలిన సమస్యలను కూడా అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.