10-10-2024 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ కాలనీలో గత నెల 30న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుధారాణి (44) గత నెల 30న సాయంత్రం తన ఇంట్లోనే దారుణహత్యకు గురైంది.
కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ఆమెను హత్య చేసింది షేక్ జావేద్ అలియాస్ అమీర్ అలీగా గుర్తించారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన జావేద్‌కు రెండేళ్లుగా సుధారాణితో పరిచయం ఉంది. నగరంలోని విద్యానగర్‌లో నివాసం ఉం టూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న జావేద్.. సుధారాణి వద్ద చిట్టీ కడుతున్నాడు.
కాగా, తనకు రావాల్సిన చిట్టీ డబ్బులు రూ.2.40 లక్షలు ఇవ్వకపోవడంతో పాటు ఇంటికి పిలిపించి బెదిరింపులకు గురిచేయడం, తప్పుడు కేసులు పెడతా అంటూ హెచ్చరించడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయిం చుకున్నాడు. మృతురాలి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గత నెల 30న కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
ఆమె బెడ్‌రూమ్‌లో ఉన్న బంగారు ఆభరణాలు, పలు పత్రాలు తస్కరించి పారిపోయాడు. సుధారాణి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు జావీద్‌ను చెంగిచెర్ల వద్ద బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.