పోక్సో కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష
పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ ఎం.జాన్,
పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, మార్చి 3 (విజయ క్రాంతి) : వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 సంవత్సరంలో నమోదైన ఒక కేసుకు మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన నిందితుడు యెర్ర సురేష్ (వీరన్నపేట, మహబూబ్నగర్) పై మంగళవారం ప్రత్యేక సెషన్స్ కోర్టు (రేప్,పోక్సో కేసుల విచారణ కోర్టు), మహబూబ్నగర్ లో తీర్పు వెలువడింది. కేసు నమోదు అనంతరం పోలీసులు తక్షణ చర్యలు తీసుకుని సమగ్ర దర్యాప్తు నిర్వహించి, చార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేశారు.
విచారణ అనంతరం ప్రత్యేక సెషన్స్ న్యాయమూర్తి తమన్ రాజ రాజేశ్వరి నిందితుడిని దోషిగా తేల్చి, ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధించారు.ఈ కేసు దర్యాప్తును అప్పటి ఎస్‌ఐ ఎన్.రామకృష్ణ (ప్రస్తుతం సీసీఎస్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్) సమర్థవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య పర్యవేక్షణలో విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి కేసును నిష్పక్షపాతంగా, వేగవంతంగా దర్యాప్తు చేసి న్యాయం సాధించడంలో కృషి చేసిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.జాన్ ని, దర్యాప్తు అధికారులను, పోలీసు సిబ్బందిని అభినందించారు. మైనర్ బాలికలపై జరిగే నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.




