16-01-2026 06:28:09 PM
భోగమహేశ్వరంలో వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
అచ్చంపేట: ఆకాశమే పందిరిగా.. భూదేవే పెల్లి పీఠలుగా.. బ్రహ్మ నిర్ణయించిన శుభ ముహూర్తానా.. చుక్కలే అక్షితలుగా మారిన సమయాన.. వేదపండితుల మంత్రోచ్ఛరణతో పార్వతిసమేత కైలాసనాథుని కల్యాణ వేడుక భక్తుల శివనామస్మరణ నడుమ కన్నుల పండువగా జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ సమీపంలోని నల్లమల అడవిలోని ఎత్తైన కొండపై వెలసిన శ్రీఉమామహేశ్వర బ్రహ్మత్సవాల సందర్భంగా ఉమాసదుల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం తెల్లవారు జామునా 4 గంటల సమయంలో వేడుకగా నిర్వహించారు.
అచ్చంపేటలోని శ్రీభ్రమరాంబదేవి ఆలయం నుంచి పార్వతిదేవిని ప్రభోత్సవంలో తీసుకొచ్చారు. కొండపై వెలసిన మహాశివున్ని మంగళవాయిధ్యాల నడుమ పల్లకిసేవలో భోగమహేశ్వరానికి తీసుకొచ్చారు. ద్వాదశ జ్యతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల ఆలయం తరఫునా ఆలయ పాలక మండలి సభ్యుడు కట్టా సుధాకర్ రెడ్డి, సహాయ కార్యనిర్వాహణ అధికారి జి.స్వాములు, వేదపండితులు గంటి రాధాకృష్ణ, సుబ్రమణ్యశర్మ, ముఖ్య అర్చకులు హరిశ్చంద్రమౌళి, పవన్ కుమార్ శర్మ, పరిచారక సాయికుమార్ లు పట్టువస్త్రాలను స్వామివారికి అందజేశారు. భోగమహేశ్వరంలో ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో పార్వతిపరమేశ్వరుల కల్యాణ వేడుకను కోలాహాలంగా నిర్వహించారు. మహాక్రతువును ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్యశాస్త్రీ నిర్వహించారు.
అనంతరం దేవేరులకు వడిబియ్యం పోసి మెక్కులు చెల్లించుకున్నారు. మహక్రతువులో ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, డా.అనురాధ దంపతులు పాల్గొని.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ భీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు, కమిటీ సభ్యుడు పవన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు, వివిధ పార్టీల నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.


