పుస్తక పఠనంతోనే సమాజంలో ఉన్నత స్థానాలు సాధ్యం
- కలెక్టర్ రాజర్షి షా
- జందాపూర్ లో నూతన గ్రంథాలయం ప్రారంభం
ఆదిలాబాద్, (విజయక్రాంతి): పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్న వారే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని, గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు, విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడటంతో పాటు సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తుందని పేర్కొన్నారు.
చదువు ప్రతి ఒక్కరి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనమని, యువత తమ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ తరహాలోనే ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలో పబ్లిక్ రీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జందాపూర్ గ్రామంలో రహదారి సమస్యను ఆర్ అండ్ బీ అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని, గ్రామానికి నూతన అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిశుభ్రత ప్రతి గ్రామ అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, గ్రామ సర్పంచ్ బత్తుల గంగమ్మ, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, తహసీల్దార్ గోవింద్, డీఎల్పీఓ ఫణిధర్, ఎంపీడీఓ కృష్ణవంశీ, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






