13-09-2025 01:21:26 AM
టేకులపల్లి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): 70 ఎకరాల వారసత్వ భూమిని నకిలీ పత్రాలతో మార్పిడికి ప్రయత్నం చేసిన నిందితులపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన సోమరాజు వెంకటరాజా రాంప్రసాద్, అతని కుటుంబ సభ్యులకు వారసత్వంగా వారి తాత నుంచి సంక్రమించిన భూమి టేకులపల్లి మండలం, సంపత్ నగర్ గ్రామం, గంగారం రెవెన్యూ పరిధిలో ఉన్న 70 ఎకరాల భూమి ఉన్నది.
ఈ భూమి సర్వే నెంబర్ 303/2/157లో ఉంది. ఆ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో మాలోత్ నాగలక్ష్మి, భూక్యా భావ్‌సింగ్, గూగులోత్ సక్కుబాయి, మాలోత్ బలరాం (కేటీపీఎస్ డీఈ), మెట్ట వెంకటేశ్వర్లు, ఏలూ రు కోటేశ్వరరావు, కోరం చిట్టిబాబు నకిలీ స్టాంపు పేపర్లను సృష్టించారు. భూమి తమ పేర మార్పిడికి ప్రయత్నించగా సోమరాజు వెంకట రాజా రాంప్రసాద్ బోడ పోలీసుల కు ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోడు ఎస్సు శ్రీకాంత్ తెలిపారు.