13-09-2025 12:58:45 AM
టేకులపల్లి, సెప్టెంబర్ 12,(విజయక్రాంతి):టేకులపల్లి మండల కేంద్రం నుంచి ఉమ్మడి ముత్యాలంపాడు గ్రామ పంచాయతీకి వెళ్లే రహదారి బుధవారం కురిసిన భారీ వర్షానికి కోతకు గురై తెగి పోయింది. రోడ్డు తెగిపోయి మూడు రోజులు గడుస్తున్నా మరమత్తులు చేపట్టేందుకు ఏ అధికారి కూడా ముందుకు రాలేదు. దీనితో ముత్యాలంపాడు, కొత్తతండా, పాతతాండా, తూరుపుగూడెం, రాంపురం తదితర గ్రామాలతో పాటు, కొత్తగూడెం, సుజాతనగర్ మండలాలకు వెళ్లే రహదారి కావడంతో ఈ రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ మార్గంలో పొలాలకు వెళ్లే వారు నానా అవస్థలు పడుతున్నారు. సంబంధిత శాఖా అధికారులకు పట్టింపు లేకపోవడంతో కొత్తగా ఈ మార్గంలో వెళ్లే వారు ఎక్కడివరకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా మూళ్ళ కంచె అడ్డుగా పెట్టారు తప్ప రోడ్డు తెగిన ప్రాంతంలో మట్టిని పొసే ప్రయత్నం చేయడం లేదని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని రోడ్డు మరమత్తులు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.