calender_icon.png 13 September, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక పక్కాగా భూముల లెక్కలు

13-09-2025 02:33:28 AM

ఇక పక్కాగా భూముల లెక్కలు

విధుల్లో చేరిన జీపీఓలు

మహబూబాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులు (జీపీఓ) శుక్రవారం విధుల్లో చేరారు. గత ప్రభుత్వం విఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దుచేసి ఇతర శాఖలకు కేటాయించిన వీఆర్వో, వీఆర్‌ఏలకు నూతనంగా జీపీవోలుగా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇతర శాఖలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో, వీఆర్‌ఏలకు అర్హత పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని ఇటీవల జీపీవోలుగా నియమించింది. ఈనెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన జిపిఓలకు నియామకం పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లాలకు కేటాయించిన జిపిఓ లను సొంత నియోజకవర్గంలో కాకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాలలో జిపివోలుగా నియమించారు.

అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి రెవెన్యూ గ్రామాల వారిగా నియామకానికి ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 147 మంది జీపీఓ లు తమకు నచ్చిన రెవిన్యూ గ్రామానికి ఆప్షన్లను ఇచ్చుకోగా, ఆ మేరకు వారిని ఆయా గ్రామాలకు కేటాయించారు. దీనితో ఇంతకాలం తాము విధులు నిర్వహించిన శాఖల నుండి జీపీఓ లుగా నియమితులైన వీఆర్‌ఏ, వీఆర్వోలు రెండు రోజుల నుండి రిలీవ్ అయి శుక్రవారం కొత్త ఉద్యోగంలో కొలువుదీరారు. కొత్తగా విధుల్లో చేరిన జీపీఓ లు భూముల లెక్కలు పక్కాగా నిర్వహించాల్సిన బాధ్యత చేపట్టనున్నారు. 

148 మంది జీపీఓల నియామకం 

మహబూబాబాద్  జిల్లా వ్యాప్తంగా 151 జీపీఓలకు గాను 148 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన వారందరికీ నియామకపు పత్రాలు సీఎం చేతుల మీదుగా అందించాం. ఇందులో శుక్రవారం 144 మంది జీపీఓ లు గతంలో పనిచేసిన శాఖల నుండి రిలీవ్ అయి తమకు కేటాయించిన రెవిన్యూ గ్రామాల్లో బాధ్యతలు చేపట్టారు. మిగిలిన మరో నలుగురు కూడా సోమవారం విధుల్లో చేరనున్నారు. ప్రభుత్వం నూతనంగా నిర్దేశించిన విధంగా కొత్తగా నియమితులైన జీపీఓ లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
 
- కే.అనిల్ కుమార్, అదనపు కలెక్టర్,   మహబూబాబాద్ జిల్లా