నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పట్టణ పరిధిలోని ప్రైవేటు లేఅవుట్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. గురువారం మెడికల్ కళాశాల, జిల్లా ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలోని లేఅవుట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేఅవుట్లలో రహదారుల వెడల్పు, హద్దులు, ప్లాట్ల విభజన, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో జనాభా, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారులకు కేటాయించిన స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించకుండా పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు, రహదారులు, ప్రజా స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. లేఅవుట్ల అనుమతులు, రికార్డులు, స్థల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






