జిల్లా, మండల స్థాయిలో క్రియాశీలక శిక్షణ తరగతులు నిర్వహించాలి
మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్
దోమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులకు నిర్వహించిన మాదిరిగానే మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యవర్గ ప్రతినిధులకు క్రియాశీలక శిక్షణా తరగతులు నిర్వహించాలని దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీగల తిరుమల్ గౌడ్ కోరారు. ఆయన బుధవారం దోమకొండ లో విలేకరులతో మాట్లాడుతూ... అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సూచన మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పది రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించడం పార్టీకి శుభ సూచకమని అన్నారు.
శిక్షణ తరగతులలో లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శిక్షణ తరగతులకు వచ్చి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజలతో మమేకం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవగాహన కల్పించడం చారిత్రాత్మక విప్లవమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శిక్షణ తరగతులకు రాహుల్ గాంధీని స్వాగతించి, జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త ఉత్సాహాన్ని నింపారన్నారు.
పది రోజుల శిక్షణతో డిసిసి అధ్యక్షులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు, రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. 1998వ సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లక్ష్మీ కళ్యాణం మండపంలో జిల్లా, మండల కార్యవర్గ ప్రతిదులకు పార్టీ అధిష్టానము శిక్షణ తరగతులు నిర్వహించిందని గుర్తు చేశారు. ఆ శిక్షణ అప్పటి నాయకులు, కార్యకర్తలకు పార్టీపై అంకితభావంతో పనిచేయటానికి ఉపయోగ పడిందన్నారు. జిల్లా, మండల స్థాయిలోనూ కార్యవర్గ ప్రతినిధులకు, క్రియాశీలక కార్యకర్తలకు ఇదే మాదిరిగా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, దోమకొండ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు పాల్గొన్నారు.




