22 June, 2026 | 8:28 PM

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్

22-06-2026 07:43 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాథమిక పాఠశాలలో సోమవారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులకు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి విద్యాభ్యాసం, పాఠశాల పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

విద్య జీవితంలో అత్యంత విలువైన సంపద అని, ప్రతి విద్యార్థి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి విద్య కీలకమని పేర్కొంటూ, విద్యార్థుల భవిష్యత్‌కు దోహదపడే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొన్నారు.