చదువుకునేదెలా..?
- సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అందని పుస్తకాలు, దుస్తులు
విద్యా సంవత్సరం ప్రారంభమైనా హాస్టళ్లకు చేరుకోని వైనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నోట్‌బుక్స్ , పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇంకా అందలేదు. ఇప్పటికే విద్యార్థులు హాస్టళ్లకు చేరుకొని నిరీక్షిస్తున్నారని, సంక్షేమ విద్యార్థుల పట్ల ప్రభుత్వం ముందు చూపుగా వ్యవహరించలేదని పలువురు విమర్శిస్తున్నారు. పాఠశాలల పునః ప్రారంభం నాడే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ అందించాలని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అందుకు తగ్గట్లుగా పాఠశాలల విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేసింది. కానీ హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల విషయంలో మాత్రం ప్రభుత్వం తీరు మరోలా ఉంది. అయితే, యూనిఫామ్స్ అందించేందుకు కలెక్టర్, సంక్షేమ, విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించినప్పటికీ టెస్కో నుంచి క్లాత్ మెటీరియల్ ఇంకా రాకపోవడంతో అధికారులు, విద్యార్థులు వేచి చూస్తున్నారు. ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రమే సగం క్లాత్ మెటీరియల్ వచ్చినట్లు సమాచారం.
ఇక విద్యార్థులకు రావాల్సిన నోట్ బుక్స్ పూర్తి స్తాయిలో రాలేదు. వచ్చినవి ఇంకా హాస్టళ్లకు చేరుకోలేదు. గత ప్రభుత్వానికి చెందిన అమాత్యుల పేర్లు ఉండడం వల్ల పాఠశాలల్లో ఇవ్వాల్సిన పుస్తకాల పంపిణీని కూడా పలుచోట్ల పంపిణీ చేయకుండా ఆపేశారు. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ఇలాంటి తరుణంలో ఉన్న విద్యార్థులకు సకాలంలో బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నిరీక్షణలో విద్యార్థులు, అధికారులు
యూనిఫామ్స్, నోట్‌బుక్స్ కోసం అధికారులు, విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 12 ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 414 మంది విద్యార్థులు, 4 ఎస్టీ హాస్టళ్లలో 549 మంది, 10 బీసీ సంక్షేమ హాస్టళ్లలో 523 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ సంవత్సరం అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు ప్రతి సంవత్సరం నాలుగు జతల యూనిఫామ్స్‌ను ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా అందిస్తోంది. అయితే 2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన నోట్‌బుక్స్, యూనిఫామ్స్ అందలేదని.. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు కోరుతున్నారు.






