బుద్ధారంలో ఆధ్యాత్మిక చైతన్య శ్రీరామ హృదయ కలశ శోభాయాత్ర
గణపురం,(విజయక్రాంతి): మండలంలోని బుద్ధారం గ్రామంలో శనివారంఆధ్యాత్మిక చైతన్యం శ్రీరామ హృదయ కలశ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చిన్న జీయర్ స్వామి 70వ తిరు నక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో శ్రీరామ హృదయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల బాధ్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.
టిటిడి ఉమ్మడి జిల్లా సమన్వయకర్త కృష్ణమూర్తి, జయశంకర్ జిల్లా బాధ్యులు రాఘవేంద్ర రాజు స్వామి ఆదేశాల మేరకు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బుద్ధారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీరామ హృదయం మహా కలశ నగర సంకీర్తనను నిర్వహించారు. ఆలయ అర్చకులు శేషం శేషాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, నిర్వాహకులు ఆకుల సుభాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కలశ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ విడిదినేని శ్రీలత,అశోక్ దంపతులు హాజరయ్యారు. రామనామ స్మరణతో, ఆధ్యాత్మిక భావనతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.
మహిళలు మంగళహారతులతో, పూలు, పండ్లు, కొబ్బరికాయలతో మహా కలశాన్ని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. గ్రామ పురవీధుల్లో అంగరంగ వైభవంగా కలశ శోభాయాత్ర నిర్వహించి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం హారతి, నివేదన కార్యక్రమాలతో శోభాయాత్ర ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మారవేణి ఐలయ్య, మార్కెట్ కమిటీ సభ్యులు వంగపల్లి భాస్కర్, ఒద్దుల రామదాసు, పాండవుల భద్రయ్య, గందే ప్రకాష్, సింగం రాజవీరు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.






