కలుషిత నీటితో ప్రజల అవస్థలు
ఫిల్టర్ నీరేదీ.. కలుషిత నీరే గతి
నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకి సిపిఎం వినతి
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది వార్డుల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా ఫిల్టర్ చేయని నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యుడు ఎస్‌ఏ. నబీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. 1, 2, 19, 20, 21, 22, 23, 24 వార్డుల్లో ప్రజలు సరఫరా అవుతున్న నీటినే తాగునీటిగా వినియోగించాల్సి వస్తోంది.
దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు చర్మవ్యాధులు, డయేరియాతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు దోమల నివారణకు ఫాగింగ్ కూడా చేపట్టడం లేదని, మున్సిపల్ అధికారులు సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలు, వసతి గృహాల విద్యార్థులతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బయ్యా అభిమన్యు పాల్గొన్నారు.






