పరిహారం వివాదంలో వేధింపులు.. దంపతుల ఆత్మహత్యాయత్నం
బిక్కనూర్,(విజయక్రాంతి): పరిహారం విషయంలో ఏర్పడిన వివాదం, వేధింపుల నేపథ్యంలో బిక్కనూర్ మండలం బస్వాపూర్‌కు చెందిన కుర్మిండ్ల శ్రీనివాస్ గౌడ్, ఆయన భార్య శ్రీలత శనివారం ఉదయం ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. వివరాల ప్రకారం.. జూన్ 25న బస్వాపూర్ సమీపంలో ఆటో, కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో రమేశ్ గౌడ్ మృతి చెందగా, ఆటో డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్‌కు రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని మృతుడి బంధువు కాసాల సత్యాగౌడ్‌తో పాటు గ్రామ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సిద్ధరామేశ్వర్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్ బావను మధ్యవర్తిగా తీసుకున్నట్లు తెలిసింది. పరిహారం చెల్లింపులో భాగంగా శ్రీనివాస్ గౌడ్ రూ.లక్ష చెల్లించి, మిగిలిన మొత్తాన్ని గడువులోగా చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే గడువు ముగిసినా మిగిలిన మొత్తం చెల్లించలేకపోవడంతో మరికొద్ది రోజులు సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.
అయితే సమయం ఇవ్వకపోగా, తన బావను కాసాల సత్యాగౌడ్ ఇష్టానుసారం దూషిస్తూ మాట్లాడినట్లు శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంతేకాకుండా తనపై ఒత్తిడి, వేధింపులు జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో కాసాల సత్యాగౌడ్ తనను తీవ్రంగా వేధిస్తున్నారని, తన మృతికి ఆయనే కారణమని పేర్కొంటూ.. తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని రాసినట్లు సమాచారం.
అనంతరం దంపతులు ఎలుకల మందు సేవించగా, స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం శ్రీలత పరిస్థితి నిలకడగా ఉండగా, శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.






