హ్యాండ్లూమ్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, మార్చి 29(విజయ క్రాంతి): హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, డిప్లొమా-స్థాయి విద్యకు ప్రాధాన్యతనిస్తూ చేనేత, వస్త్ర సాంకేతికతలో ప్రత్యేక కోర్సులను అందిస్తుందని అర్హులైన వారు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకనటలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ పరిపాలనా నియంత్రణలో నడుస్తున్న కేఎల్బి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు మొదటి సంవత్సరానికి గాను అభ్యర్థులు పదవ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలన్నారు. ప్రవేశాల ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తుందన్నారు.
అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 23 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టి అభ్యర్థుల కోసం గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. ఇది 2026-27 విద్యా సంవత్సరం జూలై 16 నాటికి వర్తిస్తుందన్నారు. సీబీఎస్‌ఈ, ఇతర విద్యా బోర్డులు 10వ తరగతి పరీక్షలకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నందున, అభ్యర్థులు తమ మార్కుల ధృవీకరణ పత్రాలను దరఖాస్తుతో సమర్పించాలి. మెరిట్ జాబితా 10వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక చేయబడతుందన్నారు.
అంతే కాకుండా గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం విషయాలతో 10+2 ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 2వ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశం కల్పిస్తారని, కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 2,500/- స్టైపెండ్ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ఇట్టి సదవకాశాన్నిఅర్హులైన వారు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించినారు.




