30 March, 2026 | 2:17 AM

ఎక్వాయిపల్లిలో అక్షరాస్యత పరీక్ష

30-03-2026 12:00 AM

కడ్తాల్, మార్చి29(విజయక్రాంతి): మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో ’ఉల్లాస్ - నవ భారత్ సాక్షరత కార్యక్రమం’లో భాగంగా ఆదివారం కర్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామం లో మహిళా సంఘాల సభ్యులకు అక్షరాభ్యాసం, వయోజన విద్యా పరీక్షను నిర్వహించారు. స్థానిక సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్ మాట్లాడుతూ, ఒక మహిళ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం విజ్ఞానవంతం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వయోజన విద్యా పథకాలను మహిళలు అందిపుచ్చుకోవాలని, అక్షరాస్యత ద్వారానే సామాజిక చైతన్యం సాధ్యమన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్సాహంగా ఈ పరీక్షకు హాజరయ్యారు.

చదవడం, రాయడంతో పాటు ప్రాథమిక అంకగణితంలో వారి నైపుణ్యాలను ఈ సందర్భంగా పరీక్షించారు. ఉల్లాస్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న నవ భారత్ సాక్షరత కార్యక్రమం. 15 ఏళ్లు పైబడి చదువుకోలేని వారికి కనీస అక్షరాస్యత, డిజిటల్ నాలెడ్జ్ మరియు ఆర్థిక అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ’అక్షరాస్యత కలిగిన గ్రామంగా’ ఎక్వాయిపల్లిని తీర్చిదిద్దాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.