కల్తీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు
వెయ్యి బస్తాల కల్తీ ఎరువుల విక్రయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మండలశవ్యవసాయాధికారి
మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో వ్యవసాయ,పోలీస్ శాఖ కోరమండల్ కంపెనీ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించిన విచారణలో కల్తీ డి.ఏ.పీ ఎరువుల దందా భాగోతం వెలుగులోకి వచ్చింది. గత మూడు రోజులుగా మండల వ్యవసాయాధికారి బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో సుమారు వెయ్యి బస్తాల కల్తీ డి.ఏ.పీ ఎరువులు రఘునాథపాలెం,చౌటపల్లి మేళ్లచెరువు మండల పరిధిలోని వేపల మాధవరం ఇతర కొన్ని గ్రామాల్లో విక్రయించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
బుధవారం హుజూర్ నగర్ ఏ డి ఏ రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం రఘునాథ పాలెం గ్రామానికి చెందిన కొండేటి పిచ్చిరెడ్డి అనే వ్యక్తి ఫెర్టిలైజర్ లైసెన్స్ లేకుండా గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో రైతులకు ఈ పాస్ బిల్లులు లేకుండా ఎరువుల బస్తా రూ.1500 పైగా ధరతో విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని తెలిపారు.ఈ సందర్భంగా కోరమండల్ కంపెనీ ప్రతినిధులు అక్కడికి చేరుకొని అనుమానాస్పద డి.ఏ.పీ ఎరువుల శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
పరీక్ష ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు మండల పోలీసు స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ ను కోరారు.ఈ సందర్భంగా వ్యవసాయాధికారులు మాట్లాడుతూ రైతులు లైసెన్స్డ్ ఎరువుల విక్రయ కేంద్రాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని, బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని, అనుమానాస్పద ఎరువుల విక్రయాలపై వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం అందించాలని సూచించారు.






