15 July, 2026 | 3:40 PM

Breaking News

వికలాంగుల న్యాయమైన హక్కులను అమలు చేయాలి

15-07-2026 03:40 PM

- జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ 

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): వికలాంగుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వికలాంగుల పెన్షన్స్ వెంటనే పెంచి అందించాలి. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో వికలాంగుల జీవో ప్రకారం ఐదు శాతం రిజర్వేషన్స్ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బస్, ట్రైన్ పాస్ లను పునరుద్ధరించాలన్నారు. 

ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని వికలాంగుల హక్కుల గురించి, వాటి అమలు గురించి ప్రశ్నించకపోవడం బాధగా ఉందని, కేవలం ఓట్ల సమయంలో వికలాంగులకు ప్రాధాన్యతనిచ్చి ఇప్పుడు విస్మరించడం ఎంతవరకు న్యాయమని, అన్ని పార్టీలు వికలాంగులను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్స్ పెంచినట్లుగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్స్ వికలాంగులకు పెంచి అందించాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల హక్కులు, న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం లక్షేట్టిపేట పట్టణ, మండల నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కులు పోరాట సమితి నాయకులు ముల్కల్ల శ్రీనివాస్, దేవి ప్రకాష్, కోడిజుట్టు రాజేశం, రఘుపతి, రాకేష్, రాజలింగు, రవీందర్, లచ్చన్న, రాజు, సాయన్న తదితరులు పాల్గొన్నారు.