13-07-2024 01:46:41 AM
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): నైనీ గని సమస్య పరిష్కారానికి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నైనీ బ్లాక్ నుంచి మరో రెండు, మూడు నెలల్లోనే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న నైనీ బ్లాక్‌లో ఉత్పత్తిపై ఒడిశా సీఎం మోహన్‌చరణ్ మాజీ సానుకూలంగా స్పందించారు. గనిలో బొగ్గు వెలికితీతకు తెలంగాణకు సహకరిస్తామని, అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని అధికారులను మోహన్‌చరణ్ ఆదేశించారు.
నైనీలో బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరగా ఒడిశా సీఎం సానుకూలంగా స్పం దించారు. 2015లో ఒడిశాలోని అంగుల్ జిల్లాలో గల నైనీ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆ గనుల్లో తవ్వకాలను ఇప్పటివరకు చేపట్టలేదు. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తిని ప్రారం భించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరేందుకు డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో రాష్ట్ర బృందం శుక్రవారం ఒడిశాకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం మాజీని కలిశారు. సింగరేణి, తెలంగాణకు నైనీ బొగ్గు బ్లాక్ ఆవశ్యకతను వివరించారు. 2015లో ఈ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారని, బొగ్గు తవ్వేందుకు పర్యావరణ అనుమతులు కూడా వచ్చినట్లు చెప్పారు.
కోల్ వెలికితీతకు అనుమతులు ఇవ్వాలని గతంలో కేంద్రానికి అందజేసిన లేఖలను చూపెట్టారు. ఈ బ్లాక్‌లో తొవ్వకాలు ప్రారంభమైతే ఒడిశాకు ప్రయోజనం చేకూరుతుందని మాజీకి భట్టి వివరించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయని, పన్నులు రూపంలో రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ మేరకు ఒడిశా సీఎంకు భట్టి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన మాజీ.. గనికి చెందిన భూములు, విద్యుత్, రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని అధికారులను ఆదేశించారు. నిర్వాసితుల సమస్యపై కూడా దృష్టి సారించాలని సూచించారు.
కీలక ఐదు అంశాలు
నైనీ బ్లాక్ సందర్శన
ఒడిశా సీఎం మోహన్‌చరణ్‌తో సమావేశం అనంతరం భువనేశ్వర్‌కు 140 కిలోమీటర్ల దూరంలోని నైనీ బొగ్గు గనుల ప్రాంతాన్ని భట్టి సందర్శించారు. తొలుత భట్టికి చెండిపడ ఎమ్మెల్యే అగస్తి బెహరా స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మె ల్యే, అధికారులు, నిర్వాసితులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి గని ప్రాంతాన్ని కలియతిరిగారు. భట్టి వెంట తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఉన్నారు. ఈ సందర్భంగా గనికి సంబంధించిన రోడ్డు రవాణా, తదితర సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నైనీ బ్లాక్ నుంచి ఏడాది దాదాపు కోటి టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయొచ్చని డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు.