20 March, 2026 | 4:37 AM

పేట్రేగిన ఇరాన్

20-03-2026 01:11 AM
  1. చెలరేగిన ఇరాన్
  2. గల్ఫ్ గ్యాస్ గోస

* ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాకు వెన్నెముకగా ఉన్న సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో.. ప్రతీకారంతో రగిలిన ఇరాన్.. సౌదీ, ఖతర్‌లోని చమురు కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని భీకర వైమానిక దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని చమురు దిగ్గజం అరామ్కోకు చెందిన సామ్రెఫ్ రిఫైనరీపై, ఖతర్‌లోని గ్యాస్ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

సౌదీ అరేబియాలో సమైఫ్ రిఫైనరీ, జుబైల్ పెట్రో కెమికల్ కేంద్రం, యూఏఈలో అల్ హోస్ గ్యాస్ ఫీల్డ్, ఖతర్‌లో మెసయీద్, రాస్‌లాపాన్ వంటి కీలక కేంద్రాలపై విరుచుకుపడింది. దీనితో గల్ఫ్ దేశాల్లో తీవ్ర భయాందోళనలు, కలవరం మొదలైంది. మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన మీనా అల్-అహ్మది కేంద్రంతో సహా, కువైట్‌లోని రెండు చమురు రిఫైనరీలు కూడా లక్ష్యంగా దాడులు జరిగాయి.

ఇరాన్ చేసిన దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మూడో వారంలో కొత్త మలుపు తిరిగింది. గల్ఫ్ ప్రాంతం యూరప్, ఆసియా, భారత తదితర దేశాలకు ఒక ప్రధాన ఇంధన కారిడార్‌గా కొనసాగుతోంది. గ్యాస్ కేంద్రాలపై దాడుల ప్రభావం తక్షణమే కన్పిస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ కొనుగోలుదారులలో ఒకటైన భారత్‌పై ఈ పరిణామాలు గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.  భారత్‌కు అవసరమైన ఎల్పీజీలో సుమారు 80 ఖతర్, సౌదీ అరేబియా నుంచే వస్తుంది. ఈ అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే సరఫరాపై తీవ్ర ప్రభావం పడి, భారత్‌లో ఎల్పీజీ సంక్షోభానికి దారితీసే ముప్పు పొంచి ఉంది.

  1. గల్ఫ్ దేశాల ఆయిల్, గ్యాస్ కేంద్రాలపై ఐఆర్‌జీసీ భీకరదాడులు
  2. ఇంధన ప్లాంట్లే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం
  3. సౌదీ, యూఏఈ, ఖతర్‌లోని కీలక కేంద్రాలపై గురి
  4. ప్రపంచ ఎల్‌ఎన్‌జీకి వెన్నెముకైన సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్ ధ్వంసం
  5. భారత్‌తోపాటు అన్నిదేశాలపై తీవ్ర ప్రభావం!

టెహ్రాన్, మార్చి 19: ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ ఉధృతం దాల్చుతూ.. తాజా గా చమురు యుద్ధంగా యూటర్న్ తీసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో కొనసా గుతున్న తీవ్ర ఉద్రిక్తతలు మూడో వారంలో కొత్త మలుపు తిరిగింది. ఇంధన ఆస్తులను ఇరాన్ పదేపదే లక్ష్యంగా చేసుకుంటోంది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్‌పై దాడి జరిగిన తర్వాత, టెహ్రాన్ ప్రతీకారంగా ఖతర్, యూఏఈలలోని గ్యాస్ కేంద్రాలే టార్గెట్‌గా పేట్రేగిపోతోంది.

ఇంధన సంక్షోభమే లక్ష్యం గా ఇరాన్ వ్యూహం పన్నింది. గల్ఫ్ దేశాల ఆయిల్, గ్యాస్ కేంద్రాలపై ఐఆర్‌జీసీ భీకర దాడులు చేస్తుండడంతో ఇంధన రంగాలు యుద్ధభూమిగా మారుతున్నాయి. ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాకు వెన్నెముకగా ఉన్న సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్ ధ్వంసమైంది. దీన్ని ప్రభావం భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తం గా పడుతోంది. మార్చి 17 వరకు, యూ ఎస్‌ ఇజ్రాయెల్ గల్ఫ్‌లోని ఇరాన్ ఇంధన ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోకుండా సంయమనం పాటించాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ చమురు ఎగుమతులలో 90% వాటా కలిగిన ఖర్గ్ ద్వీపంపై దాడి చేసినప్పుడు కూడా, కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్, ఖతర్‌తో పంచుకుంటున్న సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో బుధవారం ఈ పరిస్థితి మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, సౌదీ అరేబియాలోని చమురు దిగ్గజం అరామ్కోకు చెందిన సామ్రెఫ్ రిఫైనరీపై, అలాగే ఖతర్ యూఏఈలోని గ్యాస్ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది.

సౌదీ అరేబియాలో సమైఫ్ రిఫైనరీ, జుబైల్ పెట్రో కెమికల్ కేంద్రం, యూఏఈలో అల్ హోస్ గ్యాస్ ఫీల్డ్, ఖతర్‌లో మెసయీద్, రాస్‌లాపాన్ వంటి కీలక కేంద్రాలను టార్గెట్ చేసుకుంది. ఈ ప్రాంతా ల్లో పనిచేస్తున్న వారంతా వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ కావడంతో గల్ఫ్ దేశాల్లో కలవరం తీవ్రభయాం దోళనలు చెలరేగుతున్నాయి. నార్త్ ఫీల్డ్‌పై దాడి జరగనప్పటికీ, దోహాలోని రాస్ లఫాన్ ఎన్‌ఎల్‌జీ కేంద్రంపై క్షిపణులను ప్రయోగించి, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది.

ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఖతర్ ఎనర్జీ, ఇరాన్ దాడుల తర్వాత దీనిని గతంలో పాక్షికంగా మూసివేసింది. ఖతర్ మాత్రమే కాకుండా, ఇరాన్ యూఏఈలోని హబ్షాన్ గ్యాస్ కేంద్రం, బాబ్ క్షేత్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది. కానీ చాలా క్షిపణులను వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. హబ్షాన్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ శుద్ధి కేంద్రాలలో ఒకటి. ఈ దాడిని ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు కలిగించే ‘ఉగ్రవాద దాడి‘గా అభివర్ణిస్తూ, ఇరాన్‌ను యూఏఈ అరుదుగా ఖండించిందంటే దీన్ని తీవ్రతను అంచనా వేయవచ్చు.

సౌదీ అరేబియాలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై కూడా దాడి చేస్తామని టెహ్రాన్ ప్రతిజ్ఞ చేసింది. ఎర్ర సముద్రంలోని యాన్‌బు ఓడరేవులో ఉన్న అరామ్కోకు చెందిన సామ్రెఫ్ రిఫైనరీపై దాడులు చేసింది. ఇది పరిస్థితి తీవ్రతరం కావడాన్ని సూచిస్తుంది. హోర్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేయబడటంతో, ఎర్ర సముద్రంలోని యాన్బు ఓడరేవు గల్ఫ్ నుంచి ముడి చమురును ఎగుమతి చేసే రెండు ప్రధాన మార్గాలలో ఒకటిగా ఉంది.

మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన మీనా అల్-అహ్మది కేంద్రంతో సహా, కువైట్‌లోని రెండు చమురు రిఫైనరీలు కూడా లక్ష్యంగా దాడులు జరిగాయి. చము రు శుద్ధి కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని, కానీ నష్టాన్ని అదుపులోకి తెచ్చినట్లు కువైట్ తెలిపింది.

ప్రపంచ ఎల్‌ఎన్‌జీ సరఫరాకు వెన్నెముకగా సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్

ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్త ఎల్‌ఎన్‌జీ సరఫరాలకు వెన్నెముకగా ఉంది. ఇజ్రాయెల్ దాడి తర్వాత చమురు, గ్యాస్ ధరలు తక్షణమే పెరగడాన్ని బట్టి దీని ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు. సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్‌లో 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఇది ప్రపంచ అవసరాలను 12- నుంచి 13 సంవత్సరాల పాటు తీర్చడానికి సరిపోతుందని అంతర్జాతీయ మీడియా రాయిటర్స్ నివేదించింది.

టెహ్రాన్‌కు సౌత్ పార్స్ దాని ఇంధన సరఫరాకు గుండెకాయ వంటిది. ఇరాన్ విద్యుత్‌లో సుమారు 80% ఈ గ్యాస్‌ఫీల్డ్ నుంచే ఉత్పత్తి అవుతుంది. అయితే, ఈ గ్యాస్ఫీల్ కేవలం ఇరాన్‌కు మాత్రమే చెందినది కాదు. అమెరికా మిత్రదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్‌ఎల్‌జీ ఉత్పత్తిదారు అయిన ఖతర్‌తో ఇరాన్ దీనిని పంచుకుంటుంది. ఈ ఫీల్డ్‌లోని ఖతర్ విభాగాన్ని నార్త్ ఫీల్డ్ అని పిలుస్తారు. దీని నుంచి భారీ పరిమాణంలో ఎల్‌ఎన్‌జీ ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయబడుతుంది.

ప్రపంచంపై తీవ్ర ప్రభావం!

గ్యాస్ కేంద్రాలపై జరుగుతున్న ఈ ప్రతీకార దాడులు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతోంది. ఇంధన అంతరాయాలు ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. గల్ఫ్ ప్రాంతం యూరప్, ఆసియా, భారత తదితర దేశాలకు ఒక ప్రధాన ఇంధన కారిడార్‌గా కొనసాగుతోంది. గ్యాస్ కేంద్రాలపై దాడుల ప్రభావం తక్షణమే కన్పిస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ కొనుగోలుదారులలో ఒకటైన భారతదేశంపై ఈ పరిణామాలు గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.  భారతదేశానికి అవసరమైన ఎల్పీజీలో సుమారు 80--85% ఖతర్, సౌదీ అరేబియా నుంచే వస్తుంది. ఈ అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే సరఫరాపై తీవ్ర ప్రభావం పడి, భారత్‌లో ఎల్పీజీ సంక్షోభానికి దారితీసే ముప్పు పొంచి ఉంది. ఎల్‌ఎన్‌జీని ప్రధానంగా ఎరువుల కర్మాగారాలు, సిటీ గ్యాస్ నెట్‌వర్క్ ఉపయోగిస్తాయి.

ఇవి గృహాలకు పీఎన్‌జీ (పైపుల ద్వారా గ్యాస్), వాహనాలకు సీఎన్‌జీని సరఫరా చేస్తాయి. బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు పెరగగా, ప్రామాణిక గ్యాస్ ధర కూడా 6% పెరిగింది. అమెరికాలో, గ్యాసోలిన్ ధరలు సెప్టెంబర్ 2023 తర్వాత ప్రస్తుతం అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. దెబ్బతిన్న ఇంధన ఉత్పత్తి మౌలిక సదుపాయాలను మరమ్మతు చేయడానికి సంవత్సరాలు పడుతుందని విశ్లేషకుడైన సౌల్ కవోనిక్ పేర్కొన్నారు.