20 March, 2026 | 4:54 AM

భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు

20-03-2026 01:30 AM
  1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి
  2. సమీప భవిష్యత్తులో రేట్ల కోతపై సన్నగిల్లిన ఆశలు

ముంబై, మార్చి 19: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 3.5శాతం నుంచి 3.75 శాతం వద్ద యథాతథంగా ఉంచి, కఠిన వైఖరిని అవలంబించడంతో సమీప భవిష్యత్తు లో రేట్ల కోతపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో దేశీయ మల్టీ కమొడిటీ ఎక్సేంజ్(ఎంసీఎక్స్)లో బంగారం, వెండిధరలు భారీగా పడి పోయాయి. ప్రపంచ సంకేతాలు, బలపడుతున్న డాలర్ దృక్పథం నుంచి వస్తున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తూ, వెండి ఫ్యూచర్స్ 1.5 శాతం పడిపోగా, బంగారం 1శాతం క్షీణించింది.

సాధారణంగా భౌగోళిక ఉద్రిక్తతల సమయంలో పెరిగే ఈ లోహాలు, అందుకు భిన్నంగా యూటర్న్ తీసుకున్నాయి. ఎంసీఎక్స్‌లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్ కాంట్రాక్ట్లో కిలో వెండి ధర కేవలం ఒక్క రోజులోనే 8శాతం పతనమైంది. అంటే రూ.19వేలు నష్టపోయి రూ.2.29 లక్షలకు చేరింది. బంగారం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 10 గ్రాముల బంగారం (ఏప్రిల్ డెలివరీ) ధర 4 శాతం క్షీణించింది. రూ.6,000 తగ్గి రూ.1.46 లక్షల వద్ద ట్రేడ్ అయింది.

హైదరాబాద్ బులియన్ మార్కె ట్లో గురువారం సాయంత్రానికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగా రం ధర 1.52 లక్షలుగా, కిలోవెండి రూ.2.36 లక్షలుగా నమో దైంది. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా, ఈ ధరల తగ్గుదలను కొనుగోలుకు అవకాశంగా చూడాలా లేక మరింత పతనం కోసం వేచిచూడాలా అనే సందిగ్ధం లో పెట్టుబడిదారులు ఉన్నారు. రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్ గమనం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.