calender_icon.png 9 May, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన రైతు మహోత్సవం

24-04-2025 02:23:19 AM

వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు

ఉత్సాహంగా పాల్గొన్న రైతులు

నిజామాబాద్ ఏప్రిల్ 23:(విజయ క్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన రైతు మహోత్సవ వేడుకలు నేటితో ముగిశాయి. ఈనెల 21న ప్రారంభమై మూడు రోజులపాటు కొనసాగిన ఈ ఉత్సవం బుధవారం సాయంత్రం తో ముగిసింది. పండుగ వాతావరణం లో జరిగిన ఈ రైతు మహోత్సవం కార్యక్రమంలో నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల నిర్మల్ జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఒక 130కు పైగా ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను రైతులు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

నూతన వ్యవసాయ పద్ధతులు ఆధునిక సాగుపై శాస్త్రవేత్తలు నిపుణుల సలహాలు సూచనలు రైతులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జిల్లా యంత్రాంగం రైతు మహోత్సవం కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. రైతులు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను ఆధునిక సాగు పరికరాలను అధిక దిగుబనీ అందించే వంగడాల మేలు జాతి పాడి పశువులు తదితర వాటిని స్థాలలో ప్రదర్శించారు.

వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక శాఖ మత్స శాఖ శాస్త్ర వేత్తలు నిపుణులు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ ఇతర వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు మూడు రోజుల పాటు జరిగిన వర్క్ షాప్ లో సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఏ రాజయ్య వివిధ విభాగాల అధిపతులు శ్రీలత అంజయ్య చంద్రశేఖర్ ప్రవీణ్ శివకృష్ణ శాస్త్రవేత్తలు రాజ్ కుమార్ శ్వేత రాజశేఖర్ వినయ్ స్వప్న తదితరులు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు వన్య సంరక్షణ చర్యలు ఆధునిక వ్యవసాయం భూసారం పెంపుదల అధిక దిగుబడులను అందించే వంగడాలు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించే అంశాలపై రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.

వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలను తదితర విషయాలపై దశలవారీగా రైతులకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ రైతులుగా ఎంపికయ్యా అవార్డులు అందుకున్న రైతుల తోపాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవ వేదికలో తమ అనుభవాలను తెలుపుతూ పరస్పర అవగాహన కలిగించారు. రైతు మహోత్సవంలో విశేషంగా ప్రదర్శన ఏర్పాటుచేసిన స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.