మళ్లీ సంకీర్ణాల శకం
కేంద్రంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలైంది. గురువారం ఎన్డీఏ కూటమి నాయకుడిగా ఎన్నిక కావడంతో నరేంద్ర మోడీ మూడో సారి ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి రంగం సిద్ధమయింది. అయితే మోడీ గత పదేళ్ల పదవీ కాలానికి, ఇప్పుడు మూడో సారి ప్రధానిగా కొనసాగడానికి చాలా తేడా ఉంది. మోడీ తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి సారి ఇతరుల మాటకు తలొగ్గాల్సిన పరిస్థితి. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు, దేశ ప్రధానిగా రెండు సార్లు ఆయన మాటే శాసనంగా సాగింది. తిరుగులేని మెజారిటీ ఉండడంతో ఆయన అలా చేయగలిగారు. కేంద్ర మంత్రివర్గం నాయకుడిగా ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేశారు. లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న ఏ పార్టీకయినా ప్రభుత్వంసాఫీగా నడిపించడం పెద్ద కష్టం కాదు. విధానాల రూపకల్పనలో కానీ, వాటి అమలులో కానీ అది మిత్రపక్షాలపై ఆధారపడాల్సి ఉండదు. అయితే సంకీర్ణ ప్రభుత్వాల విషయంలో అలా కాదు.
అన్ని కీలక నిర్ణయాల విషయంలోను మిత్రపక్షాల మద్దతు తీసుకోవలసి ఉంటుంది. అలా కాని పక్షంలో సంకీర్ణ ప్రభుత్వాలు స్థిరంగా ఉండలేవు. ఈ విషయాన్ని చరిత్ర చాలా సార్లు మనకు రుజువు చేసింది. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి జనతా ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దేశంలో సంకీర్ణాల శకం మొదలైంది. అప్పటినుంచి 1998దాకా దాదాపు 20 ఏళ్ల పాటు ఏర్పడిన ఏ ప్రతిపక్ష ప్రభుత్వం కూడా అయిదేళ్ల పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1998లో వాజపేయి నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభు త్వం మాత్రమే పూర్తి కాలం పదవిలో కొనసాగింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మోడీ నేతృత్వంలో నిజమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇంతకు ముందు ఉన్నవి కూడా పేరుకు సంకీర్ణాలే కానీ వాస్తవానికి బీజేపీకి ఎదు రు లేదు. అయితే వాజపేయికి, మోడీకి ఎంతో తేడా ఉంది. వాజపేయి తనకు ఇష్ట ఉన్నా లేకపోయినా మిత్ర పక్షాలను, చివరికి సొంతపార్టీ వాళ్ల ను కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకునే వారు.
మోడీకి సంప్రదించడం అలవాటు లేదనే అపప్రథ ఇప్పటికే ఉంది. ఇందిరాగాంధీ లాగా తాను అనుకున్నది చేసేయడమే ఆయనకు తెలుసు. తిరుగులేని మెజారిటీ ఉండడంతో గత పదేళ్ల పాలనలో ఆయన మాటే చెల్లుబాటు అయింది. ఇప్పుడు అలా ఉండదు. సొంతంగా మెజారిటీ లేనందున ప్రభుత్వం మనుగడ కోసం జేడీ (యు) నేత నితీశ్‌కుమార్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, షిండే, అజిత్‌పవార్ , జేడీ(ఎస్) కుమారస్వామి, చిరాగ్ పాశ్వాన్ లాంటి ఎందరో నేతలపై ఆయన ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేతలందరికీ తమవైన కోరికలు, డిమాండ్లు చాలానే ఉన్నాయి. వాటినన్నిటినీ తీర్చడానికి ప్రధానిగా మోడీకి సాధ్యమవుతుందా? ఇప్పటికే నితీశ్, చంద్రబాబులు నాలుగైదు మంత్రి పదవులు, అందులోనూ కీలక శాఖలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో పాటు ప్రత్యేక ప్యాకేజీలు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు గతంలోకన్నా ఇప్పుడు ప్రతిపక్షం బలం కూడా బాగా పెరిగింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ సొంతంగా వంద సీట్లకు చేరువయింది. ఒకప్పుడు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ గురించి మాట్లాడిన బీజేపీ ఇప్పుడు నూతనోత్సాహంతో ఉన్న రాహుల్ గాంధీతో తలపడాల్సి ఉంటుంది. అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్ థాక్రే, శరద్‌పవార్, స్టాలిన్, మమతలాంటి నేతల మద్దతు కూడా రాహుల్‌కు ఉంది. వీరంతా కూడా తమ తమ రాష్ట్రాల్లో బీజేపీని తీవ్రంగా దెబ్బతీసిన నేతలే కావడం గమనార్హం. శివసేన, ఎన్సీపీలను చీల్చినట్లుగా ఇప్పుడు ఈ పార్టీలను చీల్చడం కూడా కష్టమే.. రాబోయే రోజుల్లో పార్లమెంటులో ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవడం అంత సులువుగా ఉండదు. ఇన్ని ఎత్తుపల్లాలను అధిగమించి సంకీర్ణ ప్రభుత్వం ఎలా తన అజెండా అమలు బాటలో ముందుకు సాగుతుందో వేచి చూడాలి. అందుకే మోడీకి ఇది అగ్నిపరీక్ష!






