1 May, 2026 | 10:53 PM

Breaking News

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు   •   హనుమాన్ మాలాదారుల గిరిప్రదక్షిణ   •   సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే   •   మాజీ మంత్రి పువ్వాడను కలిసిన సోయం వీరభద్రం   •   ప్రిన్సిపల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన దీప కాసరగడ్డ   •   కలం కార్మికులే సమాజానికి దిక్సూచి   •   రైతన్న ఆందోళన చెందకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా నష్టపరిహారం ఇప్పిస్తా ఎమ్మెల్యే   •   ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి   •   మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకై పోరాటాలు ఉదృతం చేయాలి   •   ఆర్టిసీ కార్మికులకు అండగా నిలిచిన ప్రభుత్వం   •  

ఏపీలో ప్రభంజనం వెనుక?

08-06-2024 12:05 AM

ఏపీలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఫలితాలను చూస్తే, వార్ వన్ సైడ్ అయిందని చెప్పాలి. కొన్ని సర్వే సంస్థలు జగన్మోహన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని ఫిగర్‌లతోసహా చెప్పాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో అటు వైసీపీ, ఇటు టీడీపీకి అధికారంలోకి రావడం అత్యంత అవసరం. మళ్లీ జగన్మోహన్‌రెడ్డి సీఎం అయితే చంద్రబాబు రాజకీయాలు పరిసమాప్తమవుతాయన్న విశ్లేషణలు సాగాయి. చంద్ర బాబు సీఎం అయితే జగన్మోహన్‌రెడ్డిని జైలు పాల్జేస్తారన్న చర్చకూడా టీడీపీ అభిమానుల నుంచి వినిపించింది. తెలంగాణ తరహాలో ప్రత్యర్థి పార్టీ నేతపై అవినీతి ఆరోపణలు, కేసులు చుట్టుముడతాయని ముందే అనుకుంటున్నారు.

అయితే, ఏపీ ఎన్నికల ఫలితాలను చూస్తే, అభివృద్ధి, సంక్షేమంపై హామీలు, నమ్మకం గెలిచాయని స్పష్టంగా అర్థం అవుతుంది. తెలం గాణలో మాజీ సీఎం కేసిఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి మించి ఏపీలో జగన్మో హన్‌రెడ్డి చేశారంటుంటారు. అయినా, ఓటమి పాలయ్యారు. కేసీఆర్‌లాగా సేమ్  సీన్, సేమ్ డిఫీట్. ఓట్ల పండుగప్పుడు డబ్బులు పంచితే చాలనుకునే రోజులు పోయాయి. ‘మాకేం చేసిండు?’ అనే దానితోపాటు వాళ్ల ఇగోలను హర్ట్ చేయ కుండా ఉంటే చాలు. ఈ సింపుల్ పాయింట్‌ను అర్థం చేసుకున్న లీడర్లు సక్సెస్ అయ్యారు. తెలంగాణలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చక పోవడం వల్ల అధికారంలోకి రాలేక పోయారు. ఈ పరిస్థితిని చూసిన జగన్మోహన్‌రెడ్డి  ముందుగానే చాలామంది ఎమ్మెల్యేలను మార్చారు. మార్చిన వారిలో కొందరు అసంతృప్తితో పార్టీలోనే ఉన్నా తమ ప్లేస్‌లో వచ్చిన వారికి మనస్ఫూర్తిగా సహకరించలేదని టాక్. పార్టీని వీడి తెలుగు దేశం పార్టీలో, జనసేన పార్టీలో చేరిన వారు మళ్లీ ఎమ్మెల్యేలయ్యారు. కొందరు కూటమి అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. 

తన శైలికి భిన్నంగా చంద్రబాబు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనూహ్య విజయానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా చంద్రబాబు తన శైలికి భిన్నంగా వ్యవహరించడం కూటమిని విజయ తీరాలకు నడిపించిందని చెప్పక తప్పదు. 2019లో వైసీపీ చేతిలో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ ఎన్నికల్లో 3 లోక్ సభ, 23 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటూ ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారు. అందరినీ కలుపుకు పోతూ, సహనంతో పరిస్థితులకు అనుగుణంగా నడవాలని అనుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తోపాటు బీజేపీతో తెంచుకున్న బంధాన్ని పునరుద్ధరించుకోవాలనీ నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా నే బాబు ప్లాన్ చేసి, అమలు చేశారు. తన పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్పించింది బాబే అంటారు. ఓవైపు పవన్‌తో దోస్తీ చేస్తూనే బీజేపీలో చేరిన తన ఎంపీలద్వారా బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. బీజేపీతో మిత్రబంధాన్ని కొనసాగిస్తూనే బాబుకు దగ్గరవడాన్ని బీజేపీ అగ్రనాయకత్వం పవన్‌పైనా సీరియస్ అయినట్లు వార్తలుకూడా వచ్చాయి కదా. 

అంతా సానుకూల వాతావరణం

ఎప్పుడైతే పురంధేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధిష్టానం నియమించిందో అప్పటినుంచి బాబువైపు సానుకూల వాతావరణం బీజేపీ అగ్రనాయకత్వంలో స్టార్ట్ అయింది. అంతకు ముందు అధ్యక్ష్డుడిగా పనిచేసిన సోము వీర్రాజును పదవినుంచి తప్పించడం వెనుక బాబు, పవన్ హస్తం ఉందంటారు. తరువాత వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా టీడీపీలో చేరిపోయారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ నుంచి ఏపీ షిప్ట్ అవడం వెనుక బాబు వ్యూహం ఉందంటారు. ఈ విషయమై జగన్మోహన్‌రెడ్డి పబ్లిక్ మీటింగ్‌లలో ప్రస్తావించారు కూడా. 

2019లో చంద్రబాబు పవర్‌లోకి రాకుండా అడ్డుకున్న పవన్ కళ్యాణ్‌ను జగన్మోహన్‌రెడ్డి దగ్గరకు తీసుకుని ఉంటే ఏపి రాజకీయాలు మరో రకంగా ఉండేవి. జగన్‌కు సహకరిస్తూన్న బీజేపీతో జగన్‌ను విభేదించే పవన్ కళ్యాణ్ దోస్తీ చేయడం విచిత్రమే. బీజేపీతో మాట మాత్రం కూడా చెప్పకుండా చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్‌ను బీజేపీ నియంత్రించలేక పోయింది. కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్‌రెడ్డి సోదరికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేయడం కాకతాళీయం కాదన్నదీ నిజం. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, పురంధేశ్వరిలు రోజూ జగన్మోహన్‌రెడ్డిపై మాటల దాడి చేస్తుంటే, ఏం జరు గుతుందో ఏపీలో ఇప్పుడు అదే జరిగింది. వాళ్లు రోజూ ఏదో ఒక ఇష్యూను తెరపైకి తేవడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వ్యక్తిగతంగా జగన్ ఇమేజ్ ను తగ్గించేలా చేయడమే పనిగా పెట్టుకుని పని చేశారు. వారి ప్రయత్నం సక్సెస్ అయింది. 

అందరినీ కదిలించిన ‘కంటతడి’!

రాజధానిని విశాఖకు తరలిస్తున్నారంటూ విపక్షాలు చేసిన ఆందోళన అంతా ఇంతా కాదు. ఐదేళ్లూ సీఎంగా ఉండి అమరావతికి రాజధానిని ఎందుకు కట్టలేదనే అంశం మరుగున పడేయడంలో చంద్రబాబు టీం సక్సెస్ అయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయం అంశం, లాండ్ టైటిలింగ్ యాక్ట్, కిడ్నీ బాధితులకు న్యాయం చేయడం వంటి చాలా అంశాలను విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. చంద్ర బాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో జైలుకు పంపారు. వయస్సును కూడా చూడకుండా 50 రోజులపాటు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అడ్డం పెట్టుకుని చంద్రబాబును జైల్లో వేశారని టీడీపీ అభిమానులు కసితో రగిలిపోయారు. తన భార్యను అసెంబ్లీ వేదికగా అవమానించారని నిండు సభలోనే వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టిన చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని శపథం చేసి, బయటికి వచ్చేశారు. తరువాత మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. ఈ పరిణామం పార్టీలకు అతీతంగా కదిలించింది. తెలంగాణలో కాంగ్రె స్ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు సైతం అలాంటి హామీలనే ఇచ్చారు. జనంలో స్పందన కనిపించడంతో ఎన్నికల్లో ఆ హామీలను బాగా ప్రచారం చేశారు. 

కలిసి వచ్చిన అంశాలు ఎన్నో!

ఇంకో విషయం చెప్పాలి. జగన్ అధికారంలో ఉండటం వల్ల జనంతో ఎక్కువగా మమేకం కాలేక పోయారు. పబ్లిక్ మీటింగ్‌లు పెడ్తూ సంక్షేమ పథకాల లబ్ధిదా రులకు మీటలు నొక్కుతూ పోయారే తప్ప చంద్రబాబు నాయుడులా జనం మధ్య తిరగలేక పోయారు. తాడేపల్లిలో ఎక్కువ కాలం గడుపుతూ సమీక్షలు చేస్తూ ఉన్నారే కానీ, జనం ఏమనుకుంటున్నారో పసిగట్టలేక పోయారు. ఇలా ఒకదాని కొకటి అన్ని అంశాలూ చంద్రబాబుకు కలిసి వచ్చాయి. పైగా, కేంద్రంలో ఉన్న బీజేపీ.. టీడీపీ, జనసేన కూటమితో జట్టు కట్టడం బాగా కలిసి వచ్చింది. జగన్ ఏపీని నాశనం చేశారని, ఉద్యోగాలు ఇవ్వలేదని, పరిశ్రమలు తేలేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఇలా చాలా కీలకమైన అంశాలపై జనంలో జగన్‌పట్ల వ్యతిరేకతను పెంచడంలో బాబు కూటమి సక్సెస్ అయింది. అందుకే, బాబు మళ్లీ సీఎం అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగు పడుతుందని మెజార్టీ ప్రజలు భావించారు. ఫలితంగా కూటమి అభ్యర్థులు అనూహ్యంగా విజయం సాధించా రు. అయితే, కేంద్ర ప్రభుత్వం సహకరించక పోతే, ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం చంద్రబాబు నాయుడుకు అనుకున్నంత ఈజీ కాదని మాత్రం చెప్పక తప్పదు.

వ్యాసకర్త జర్నలిస్ట్

సెల్: 9963155523