సునీతా విలియమ్స్ బాటలో..
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడవసారి రోదసి ప్రయాణం చేయడం స్ఫూర్తిదాయకం. అలాగే, మన దేశ పౌరసత్వం కలిగిన భారతీయులు ప్రత్యేకించి మహిళలు రోదసీ యానం చేసేలా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రాలతోసహా ఖగోళ విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచే కార్యక్రమాలను చేపట్టాలి. ఈ మేరకు తగిన అవగాహన కలిగించే పద్ధతిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలి.
విశ్వ రహస్యాలపై కాలేజీ విద్యార్థులందరిలోనూ ఆసక్తి పెరిగేలా చూడాలి. నక్షత్రాలు, గ్రహాలపై అన్వేషణ కోసం తగు సామర్థ్యాన్ని పెంపొందించడానికి పరిశోధనలు, ప్రయోగాలు జరగాలి. ఈ మేరకు శాస్త్రవేత్తలనూ ప్రోత్సహించాలి. ప్రసిద్ధ సైంటిస్టుల జీవితకథలను యువతీ యువకులకు తెలియజేయాలి. ప్రత్యేకించి మహిళా శాస్త్రవేత్తల స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో కల్పనా చావ్లా వంటివారి బాటలో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదిగేలా టీచర్లు తగిన కార్యాచరణను చేపట్టాలి.
ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్ కర్నూల్






