బోడుప్పల్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (విజయక్రాంతి): హబ్సీగూడ సర్కిల్ పరిధి బోడు ప్పల్ ప్రాంతంలోని భవానీనగర్‌లో ఆదివారం రాత్రి దాదాపు 4 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు బోడుప్పల్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో సబ్ స్టేషన్ సిబ్బంది మద్యం తాగి నిద్రపోయారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉండగా బోడుప్పల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై విద్యుత్ శాఖ అధికారులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
సబ్ స్టేషన్ నుంచి ఉదయ్‌నగర్‌తో పాటు మరో 5 ప్రాంతాల కు సరఫరా వెళ్లాల్సిన 11 కేవీ ఫీడర్లపై చెట్లు, కొమ్మలు పడిపోవడంతో ఆదివారం సాయంత్రం 5.20 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు పోస్ట్‌లో తెలిపారు. రాత్రి 8.10 గంటలకు సరఫరాను తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
తిరిగి రాత్రి 9.15 గంటలకు ఉరుములతో కూడిన వర్షం కారణంగా 33 కేవీలో ఇన్సులేటర్ విఫలమై మౌలాలి నుంచి ఎన్‌జీఆర్‌ఐకి విద్యుత్ సరఫరా చేసే 33 కేవీ లైన్ ఇన్‌కమింగ్ సరఫరా నిలిచిపోయిందన్నారు. రాత్రి 9.40 గంటలకు జంపర్ కట్ కారణంగా సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. రాత్రి 10.25 కల్లా బోడుప్పల్ సబ్ స్టేషన్ పరిధిలోని మొత్తం ప్రాంతానికి 3 ఫేజ్ విద్యుత్ పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు.






