నిమ్స్ వైద్యులను సత్కరించిన గవర్నర్
శస్త్ర చికిత్స ద్వారా బాణం తొలగించినందుకు అభినందన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (విజయక్రాంతి): ఓ బాలుడి గుండె, ఊపిరితిత్తుల మధ్య చొచ్చుకుపోయిన బాణాన్ని అత్యంత చాకచక్యంగా శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ప్రశంసించి సత్కరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతంలోని గొత్తికోయ తెగకు చెందిన సోది నంద(17)కు ఇటీవల ప్రమాదవశాత్తు శరీరంలోకి బాణం దిగింది. వైద్యం నిమిత్తం భద్రాచలం ఏరి యా దవాఖాన, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లినా అక్కడి వైద్యులు స్పష్టత ఇవ్వకపోవడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
నిమ్స్ కార్డియోథొరాసి క్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర్ రావు, డాక్టర్ గోపాల్ పరీక్షించి శరీరంలోకి దిగిన బాణం గుండె, ఊపిరితిత్తుల మధ్య చొచ్చుకుపోయినట్టుగా గుర్తించారు. అతి తక్కువ సమయంలో శస్త్ర చికిత్స ద్వారా బాణాన్ని తొలగించి సోది నందును ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ రాధాకృష్ణన్ వైద్యుల కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం రాత్రి గవర్నర్ బంగ్లాకు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, వైద్యులు అమరేశ్వర్ రావు, గోపాల్, ఇతర వైద్య బృందాన్ని పిలిపించుకొని ఘనంగా సత్కరించారు. సోది నందుకు శస్త్ర చికిత్స చేసి బాణం తొలగించిన విషయంపై నిమ్స్ చైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎక్స్ వేదికగా అభినందించారు.






