30 March, 2026 | 2:18 AM

భూ కబ్జాలపై హౌస్ కమిటీకి ఒప్పుకోండి

30-03-2026 12:31 AM
  1. మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఇప్పటికే ఆదేశించాం

వారి అవసరాలు తీర్చలేదని మంత్రిపై ఆరోపణలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలన్న బీఆర్‌ఎస్ డిమాండ్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరణి భూ కబ్జాలపైన హౌస్ కమిటీకి సిద్ధమా అని, దానికి ఒప్పుకోవాలని సవాల్ విసిరారు. అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన తర్వాత కూడా హౌస్ కమిటీ విచారణ కోరడం ఏంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హౌస్ కమిటీలు వేసి ఏం చేశారని, హౌస్ కమిటీ విచారణ నివేదికలు ఎందు కు బయటపెట్టలేదని నిలదీశారు.

ఆదివారం అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హౌస్ కమిటీలు వేసి కొందరిని బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారని, అక్రమాలకు పాల్పడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బెదిరించేందుకు హౌస్ కమిటీ అని బీఆర్‌ఎస్ ఆందోళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాళ్ల వ్యక్తిగత అవసరాలు తీర్చలేదని మంత్రిపై బురద జల్లాలని చూస్తున్నార ని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాము ఎప్పుడు సభను ఆటంక పర్చలేదని, కానీ బీఆర్‌ఎస్ హౌస్ కమిటీ పేరుతో రెండురోజులుగా పదేపదే సభను అడ్డుకుంటుందని, బడ్జెట్ సమావేశాలు జరగకుండా అడ్డుపడుతుందని మండిపడ్డారు. ధరణి పేరుతో బెదిరించి బీఆర్‌ఎస్ నేతలు భూములు దోచుకున్నారని.. బాలానగర్ భూ దోపిడీపై హౌస్ కమిటీకి బీఆర్‌ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు.